ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో నిర్మాత వచ్చాడు. సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీలో అందరూ నిర్మాతలే. ఆయన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమాలు తీశారు. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు ‘కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లి’ బ్యానర్ స్థాపించి సినిమాలు చేశారు. అందులో మహేశ్‌బాబు ‘అర్జున్’ ఒకటి. తరవాత కుమార్తె మంజుల ‘ఇందిరా ప్రొడక్షన్స్’ స్థాపించి సినిమాలు తీశారు. ఉదాహరణకు… ‘పోకిరి’. తరవాత మహేశ్‌బాబు స్వయంగా తన పేరు మీద ‘ఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ప్రై.లి’ స్టార్ట్ చేశారు. ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు ఘట్టమనేని కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు వంతు వచ్చింది. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా ఐదు సినిమాలు ప్రకటించి, అందులో రెండు ప్రొడ్యూస్ చేస్తానని ప్రకటించిన సుధీర్‌బాబు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ బ్యానర్ స్థాపించిన ఆయనతో చిట్ చాట్…
నిర్మాతగా ఎందుకు మారారు?
నటుడిగా చాలామంది ప్రతిభావంతులను చూశా. ఏదో ఒక రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజి వుంటే… కొత్తవాళ్ళను కొంతమందిని తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా. అలాగే, స్టార్ట్ చేశా.
మీ సంస్థలో వేరే హీరోలతో సినిమాలు చేస్తారా?
ఇప్పటివరకూ నా దగ్గరకు ప్రతి ఒక్కరూ నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకొని వచ్చారు. భవిష్యత్తులో మంచి కథ వచ్చి, నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే… ఎట్ ద సేమ్ టైమ్, నాకంటే వేరే హీరోలు ఎవరైనా ఈ కథకు సూట్ అవుతారని అనుకుంటే… తప్పకుండా చేస్తా. మంచి కథను పోగొట్టుకోలేను.
ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ప్రొడక్షన్ హౌస్‌లు వున్నాయి. మీరు కొత్తగా ఎందుకు స్టార్ట్ చేశారు?
పద్మాలయ… తరవాత కృష్ణ ప్రొడక్షన్స్… దాని తరవాత ఇందిరా ప్రొడక్షన్స్ వుంది. తరవాత మహేశ్‌బాబు ప్రొడక్షన్స్ వుంది. అలాగే, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ వుంటుంది. జోక్స్ పక్కన పెడితే… నేను ఎప్పుడూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని అనుకుంటాను. నా యాక్టింగ్ కెరీర్ చూస్తే.. పక్కన కృష్ణగారు, మహేశ్ వున్నా ఏదో వాళ్ళను వాడేసుకోని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. ఐ వాంట్ టు గ్రో ఇండిపెండెంట్లీ. అందులో నాకు శాటిస్ఫ్యాక్షన్ ఎక్కువ వుంటుంది. నేను సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్.
మీ ప్రొడక్షన్ హౌస్ విజన్ ఏంటి?
నా ముందు అల్లు అరవింద్ గారు, ‘దిల్’ రాజు గారు… ఇంకా ఎంతోమంది వున్నారు. వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు చేయాలనేది నా విజన్.
నిర్మాతగా ఫస్ట్ సినిమాను కొత్తవాళ్లతో చేశారు. మీ ధైర్యం ఏంటి?
మంచి కథ, కథనాలు… అంతే! నా యాక్టింగ్ కెరీర్ చూసినా ఎక్కువమంది కొత్తవాళ్లతో పని చేశా. రిస్క్ అనుకోను.
యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ బర్డెన్ అనిపించలేదా?
సాధారణంగా సినిమా షూటింగులు 70 రోజులు జరుగుతాయి. అంటే.. నా రేంజ్ సినిమాలకు హీరో 60 లేదా 70 రోజులు ఇవ్వాలి. ఇంకో పది రోజులు చేయడం బర్డెన్ అయితే ఏం కాదు. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు.
ఇప్పుడు ప్రొడక్షన్… నెక్స్ట్ డైరెక్షన్లోకి వస్తారా?
నేను ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. నెమ్మదిగా ప్రొడ్యూసర్ అయ్యాను. బహుశా… దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అటువంటి ఆలోచనలు ఏమీ లేవు.
బయట ప్రొడక్షన్లో సినిమాలు చేయడం మానేస్తారా?
భలేవారండీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట ప్రొడక్షన్లో చేయడానికి ఇస్తా. ఖాళీగా వున్నప్పుడు నా బ్యానర్లో చేసుకుంటా. ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని అన్నీ సినిమాలు నేనే చేసుకుంటానని అనుకోవద్దు.