సుధీర్ బాబు అనగానే… ఆరడుగుల హైటు, సిక్స్ ప్యాకు రూపమే కళ్లముందుకొస్తుంది. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ ఇదే గెటప్‌లో కనిపిస్తూ వచ్చాడు. ఆ మాటకొస్తే.. సినిమా సినిమాకీ తన ఫిజిక్ ఓ రేంజ్లో పెంచుతూ పోతున్నాడు. అయితే తొలిసారి… తను లడ్డూబాబులా లావుగా మారిపోయాడు. బూరెల్లాంటి బుగ్గలూ, ఫ్యామిలీ ప్యాక్ తో.. కొబ్బరి బొండాంలా మారిపోయాడు. ఇది కూడా సినిమా కోసమే లెండి. సుధీర్ బాబు తాజా చిత్రం మామా మశ్చింద్ర. ఇందులో దుగ్గ అనే పాత్రలో కనిపించబోతున్నాడు సుధీర్. ఫస్ట్ లుక్ ఈరోజే వచ్చింది. దుగ్గగా సుధీర్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ గెటప్ చాలా కొత్తగా ఉంది. ఇదివరకెప్పుడూ చూడని సుధీర్‌ని.. తెరపై చూడబోతున్నాం. అయితే… ఇది ఒక పాత్రే. ఇందులో సుధీర్ వర్జినల్ గెటప్ కూడా ఉండబోతోంది. పరశురామ్ పాత్రలో సుధీర్ గెటప్‌ని ఈనెల 7న విడుదల చేయబోతున్నారు. ఈ రెండు పాత్రలూ ఒకటేనా, లేదంటే వేరే లింకు ఏమైనా ఉందా? అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఎదురు చూడాలి. రైటర్ హర్షవర్థన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.