రిజల్ట్ లో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు సుధీర్ బాబు. ఆయన ఎంచుకుంటున్న డైరెక్టర్స్,సబ్జెక్ట్స్ కూడా వైవిధ్యంగా వుంటున్నాయి. ‘హరోం హర’ లాంటి యాక్షన్ సినిమా తర్వాత ఫాదర్ సెంటిమెంట్ వున్న ‘మా నాన్న సూపర్ హీరో’ తో వస్తున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు అభిలాష్ ని పరిచయం చేస్తున్నారు. దీని తర్వాత ‘జటాధర’ అనే ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ లో వుంది.
ఇదీలావుంటే సుధీర్ బాబు మరో డైరెక్టర్ కి అనూహ్యంగా అవకాశం ఇచ్చారు. ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్నారు రాహుల్ రవీంద్రన్. వెంటనే నాగర్జున నుంచి పిలుపొచ్చింది. నాగార్జున కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన మన్మధుడు సినిమా టైటిల్ వాడుకొని ‘మన్మధుడు 2’ చేశారు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రాహుల్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం రస్మికతో గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు. అది చాలా కాలంగా సెట్స్ పై వుంది. అయితే ఇప్పుడు సుధీర్ బాబు ఆయనకో ఛాన్స్ ఇచ్చారు. రాహుల్ తో సినిమా గురించి స్వయంగా సుధీర్ బాబు చెప్పారు. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.