ఏ సినిమా ఎప్పుడు హిట్టవుతుందో, ఏ ఫార్ములా ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చెప్పలేం. ఇష్టపడి చేసిన కథలు పల్టీలు కొట్టడం, భయపడి వదిలేసిన సినిమాలు హిట్టవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సుధీర్‌బాబుకీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత వారం విడుదలై.. బాక్సాఫీసుని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. `ఆర్ ఎక్స్ 100`. ఇప్పటికి రూ.5 కోట్లకు పై చిలుకు వసూళ్లు అందుకుంది. శాటిలైట్ పరంగానూ భారీగా ఆఫర్లు వస్తున్నాయి. దర్శకుడికీ, కథానాయికకీ, హీరోకి మంచి పేరొచ్చింది. అయితే ఈ ఆఫర్ ముందు సుధీర్ బాబు దగ్గరకు వెళ్లిందట. కథ విన్న తరవాత… `బాగానే ఉంది గానీ, ఇంత బోల్డ్ అయితే నేను చేయలేను` అనేశాడట సుధీర్. దాంతో.. ఈ ఆఫర్ కాస్త కార్తికేయ దగ్గర ఆగింది. సుధీర్‌కి క్లాస్ ఇమేజ్ ఉంది. `సమ్మోహనం`తో అది ఇంకాస్త పెరిగింది. నిజంగానే సుధీర్ ఈ సినిమా చేస్తే… ఇంకాస్త మైలేజీ వద్దును. కానీ… సుధీర్ శృంగార పరమైన సన్నివేశాల్లో నటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటాడు. పైగా కొత్త హీరో కాబట్టి ఎలాంటి అంచనాలూ లేకుండా జనాలు థియేటర్‌కి వెళ్లాడు. హీరో ఏడ్చినా, ప్రేమలో ఫెయిల్ అయినా, మోసపోయినా.. జనం నెగిటీవ్‌గా తీసుకోలేదు. ఒకవేళ సుధీర్ బాబు హీరో అయితే.. కథలో మార్పులు చేర్పులూ తప్పకుండా జరిగేవి. ఇంత బోల్డ్ నెస్ అప్పుడు చూసే అవకాశం దక్కేది కాదు. పైగా జనాలు కాస్తో కూస్తో అంచనాలు పెట్టుకుని థియేటర్‌కి వచ్చేవారు. ఇవన్నీ `ఆర్ ఎక్స్ 100`కి ప్రతికూలంగా మార్చే ఛాన్సుంది. కాబట్టి.. సుధీర్‌బాబు నిర్ణయాన్నీ తప్పుపట్టలేం.