సుధీర్‌బాబు సినిమా ఫంక్షన్స్ అంటే తప్పకుండా మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా వస్తాడని చాలామంది ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే… మహేశ్ చాలాసార్లు వచ్చాడు కాబట్టి. కానీ, సుధీర్‌బాబు హీరోగా నటించడంతో పాటు, నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’. మంగళవారం రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి మహేశ్ రాలేదు. సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి హాయ్ చెప్పిన సుధీర్ బాబు “మహేశ్‌కి రావడం కుదరడం లేదు. ప్రతి ఒక్కసారి ఇబ్బంది పెట్టడం బాగోదు కదా!” అని చెప్పాడు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సూపర్‌స్టార్ ఫ్యాన్స్ తనను ప్రమోట్ చేస్తున్నారని, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాడు. సూపర్ స్టార్ అభిమానులు వున్నారనే ధైర్యంతో సినిమా ప్రొడ్యూస్ చేశానని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని సుధీర్ బాబు నమ్మకం వ్యక్తం చేశాడు.
ఇంకా సినిమా గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ “నిర్మాతగా అమ్మ పేరు సమర్పణలో పెట్టాను… కలిసి వస్తుందని! అయితే… ముందు కొంచెం భయపడ్డా. మా అమ్మ చిన్నతనం నుంచి తల్లి లేకుండా పెరిగింది. తాను చాలా ధైర్యవంతురాలు. జీవితంలో ఓటమి ఎరుగదు. ఒకవేళ సినిమా రిజల్ట్ అనుకున్నట్టు రాకపోతే అని భయపడ్డా. ఎడిటింగ్ పూర్తయ్యాక మంచి సినిమా చేశామని నమ్మకం వచ్చింది. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం మరో లెవల్‌కి సినిమాను తీసుకెళ్లింది” అన్నారు. పైరసీలో సినిమా చూడవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ పైరసీలో ఎవరైనా సినిమా చూసి ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కుని తింటే అరగదని వ్యాఖ్యానించాడు.