అల్లరి నరేష్ చివరి సారిగా కొట్టిన బ్లాక్ బస్టర్ ‘సుడిగాడు’. ‘నాంది’ హిట్టయినా కలక్షన్ల పరంగా సుడిగాడుని బీట్ చేయలేకపోయింది. ‘సుడిగాడు’ ప్రభావం నరేష్ పై విపరీతంగా పడింది. సరైన కథలు ఎంచుకోకపోవడం, వరుస పరాజయాలతో నరేష్ కామెడీ కథలకు బ్రేక్ ఇచ్చేశాడు. అయితే తనలో కామెడీ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదని ‘నా సామిరంగ’ నిరూపించింది. ఇందులో నరేష్ పాత్ర అందరికీ నచ్చింది. నాగ్ కంటే ఈ సినిమాలో నరేష్ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. పాత్రే సినిమాని నిలబెట్టింది కూడా. దాంతో స్వతహాగానే నరేష్ ని వెదుక్కొంటూ ఇప్పుడు కామెడీ కథలు వరుస కడుతున్నాయి. అందులో భాగంగా ‘సుడిగాడు 2’ స్క్రిప్టు కూడా నరేష్ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది.
‘సుడిగాడు’కి సీక్వెల్ చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ నరేష్ సిద్ధంగా లేడు. స్క్రిప్టు పకడ్బందీగా ఉంటేనే తప్ప… ‘సుడిగాడు 2’ తీయకూడదన్నది నరేష్ ఫీలింగ్. నరేష్ ఆలోచనలకు, అంచనాలకూ తగ్గట్టుగానే ‘సుడిగాడు 2’ స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ‘సుడిగాడు’లో పాపులర్ తెలుగు సినిమాల్ని స్పూఫ్ చేశారు. ‘సుడిగాడు’లో హాలీవుడ్, బాలీవుడ్ ఇలా.. అన్ని రకాల సినిమాల్ని స్ఫూఫ్ చేసే ఛాన్స్ వచ్చిందని, ఈసారి స్పూఫ్లకే పీక్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ‘సుడిగాడు’ని భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. మరి ఈసారీ ఆయనే టేకప్ చేస్తారా, లేదంటే కొత్త దర్శకుడెవరైనా తెరపైకొస్తారా అనేది చూడాలి.