సామాజిక సేవారంగం వైపు సినీ నటులు దృష్టి సారించడం నిజంగా ఆహ్వానించ దగిన పరిణామమే. ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న దృక్పథాన్ని ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే. ఇప్పుడు ‘సుడిగాలి’ సుధీర్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా నేమూ, ఫేమూ సంపాదించుకొన్నాడు సుధీర్. ఇప్పుడు వెండి తెరపైనా వెలుగుతున్నాడు. సుధీర్ హీరోగా రెండు మూడు సినిమాలు ఇప్పుడు… సెట్స్‌పై ఉన్నాయి. అందులో ‘గాలోడు’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తన లక్ష్యాల్ని, ఆశయాల్ని చెప్పుకొచ్చాడు సుధీర్. తనకు ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని ఉందని, ఎప్పటికైనా తన లక్ష్యం అదేనని, అందుకు సంబంధించిన సన్నాహాలు ఎప్పుడో ప్రారంభించేశానని అంటున్నాడు సుధీర్.
”చిరు, రజనీ, పవన్ కల్యాణ్‌లే నాకు స్ఫూర్తి. ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉన్నారు. సమాజానికి తగిన రీతిలో సేవ చేస్తున్నారు. నేనూ వారి బాటలోనే నడుస్తా. నటుడిగా ఇప్పుడొచ్చిన ఫేమ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. ఇంతకంటే నేను కోరుకొన్నది ఏం లేదు. ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది. ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం అదే” అంటున్నాడు. ఈమధ్య జబర్దస్త్ లో కనిపించలేదు సుధీర్. దాంతో జబర్దస్త్ కి దూరమయ్యాడన్న కామెంట్లు వినిపించాయి. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ”జబర్దస్త్ ని నేను వీడేది లేదు. ఓ ఆరు నెలలు గ్యాప్ తీసుకొన్నానంతే. త్వరలోనే మళ్లీ ఈ వేదికపై నవ్విస్తా” అని చెప్పాడు.