కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని హత్య ఉదంతంపై పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి కర్నూలు పర్యటనకు రావడంతో.. వైసీపీ నేతలు, అధికారులు.. సుగాలి ప్రీతి తల్లిని.. ఆయన వద్దకు తీసుకెళ్లారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లి… తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన జగన్మోహన్ రెడ్డి… ఆ కేసును సీబీఐకి ఇస్తున్నామని .. భరోసా ఇచ్చారు. న్యాయచేస్తామని ధైర్యం చెప్పారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయంలో.. 2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసులో చాలా కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో పాలక పక్షం కానీ.. ప్రతిపక్షం కానీ.. ఈ కుటుంబానికి న్యాయం చేయడానికి .. పోరాటం చేయడానికి ముందుకు రాలేదు. ఆలస్యంగా తన దృష్టికి వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్.. సుగాలి ప్రీతి కుటుంబం కోసం… పోరాడాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే.. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన ఆయన స్పందించకపోవడంతో.. కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించి.. సీబీఐ విచారణ జరిపించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైసీపీ మద్దతుదారులైన కొంత మంది .. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో… నిందితులకు వైసీపీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలు బాధితుల వైపు నుంచి వచ్చాయి.
అదే సమయంలో.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అత్యాచారం, హత్య జరిగింది టీడీపీ హయాంలో కదా..అని తేలిగ్గా మాట్లాడిన వ్యవహారం కూడా.. సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం పెరిగి పెద్దదయితే.. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి మహిళల భద్రత కోసం..కృషి చేస్తున్న తమకు ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుగాలి ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు.