కర్నూలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని సుగాలీ ప్రతీ కేసును ప్రభుత్వం సీబీఐకి ఇస్తున్నట్లుగా ప్రకటన చేసింది కానీ..దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోలేదు. సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు ఎంతో ఉద్యమం చేసిన తర్వాత.. జనసేన సహా ఇతర రాజకీయపార్టీలు ఈ అంశంపై ఆందోళనలు చేసిన తర్వాత.. ఓ సారి సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ముందడుగు పడలేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు…సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని.. ప్రీతి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సుగాలి ప్రతీ తల్లిదండ్రులు నిర్ణయించారు. 5 రోజులుగా ఢిల్లీలో ప్రముఖుల్ని కలిసి న్యాయపోరాటానికి మద్దతు కోరుతున్నారు. ఏపీ పోలీసులు మాకు అన్యాయం చేశారని .. వైసీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలలకు సీబీఐ విచారణకు ఆదేశించారు.. కానీ ఇప్పటి వరకు సీబీఐ విచారణ మొదలుపెట్టలేదని ప్రీతి తల్లి పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో కర్నూలులోనే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో అనుమానాస్పద స్థితిలో సుగాలీ ప్రీతి చనిపోయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వారే ఆమెను దారుణంగా హత్య చేశారని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
గతంలో ఆ స్కూల్లో చాలా మందిపై అత్యాచారాలు జరిగాయని .. అధికారులు, రాజకీయ ప్రముఖుల అండదండలు ఉండడంతో.. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం… జనసేన నేతలు..సుగాలి ప్రీతికి న్యాయం కోసం సోషల్ మీడియాలోపోరాటం చేస్తే.. పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. గొంతు నొక్కేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకే న్యాయం కోసం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వెళ్తున్నారు.