నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం `వీర సింహారెడ్డి` సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న వస్తోంది. అంటే. మరో నెల రోజులే వ్యవధి ఉంది. అందుకే ప్రమోషన్లని మెల్లగా మొదలెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ వదిలారు. ‘జై బాలయ్య’ పాట బయటకు వచ్చింది. ఇప్పుడు మరో పాట విడుదలైంది. ‘సుగుణ సుందరి’ అంటూ సాగే మాస్ గీతాన్ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తమన్ మరోసారి మంచి బీటున్న పాట అందించాడు. రామజోగయ్య శాస్త్రి.. క్యాచీ, ట్రెండీ పదాలతో పాట అల్లేశారు. శేఖర్ మాస్టర్.. బాలయ్యతో కొన్ని సిగ్నేచర్ స్టెప్పులు వేయించాడు. ఆ స్టెప్పుల్లో కొన్ని క్లాసీగా ఉంటే, ఇంకొన్ని నాటుగా సాగాయి. మొత్తానికి ఈ పాట థియేటర్లో నందమూరి అభిమానులతో ఈల వేసి, గోల చేయించేలానే ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సినిమా ఇది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రధారి. సంక్రాంతి సీజన్ బాలయ్యకు బాగా కలిసొచ్చింది. పైగా.. ‘వీర సింహారెడ్డి’ పాటలు, ప్రచార చిత్రాల్లో వింటేజ్ బాలయ్య కనిపిస్తున్నాడు. దాంతో `వీర సింహారెడ్డి`పై అంచనాలు మరింత పెరిగాయి. ‘అఖండ’ తరవాత వస్తున్న సినిమా కావడంతో… మరోసారి రికార్డులు బద్దలే అని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.