ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకొంటున్నారు. అది ఏ రూపంలో అందిస్తారన్నది మేకర్స్ చేతుల్లో ఉంటుంది. కొత్త పాయింట్లు ఎత్తుకొంటే తప్ప.. తెరపై కొత్త సీన్లు రావు. అందుకోసం, పాయింట్ల వేటలో పడ్డారు దర్శకులు. సుహాస్ కొత్త సినిమా ‘జనక అయితే గనుక’ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూస్తే ఈ టీమ్ కూడా ఏదో ఓ కొత్త పాయింట్ పట్టారన్న నమ్మకం బలంగా కనిపిస్తోంది.
ఓ మధ్యతరగతి హీరో. పెళ్లి చేసుకొన్నాడు. పిల్లలు వద్దనుకొన్నాడు. గర్భనిరోధక సాధనాలూ వాడుతున్నాడు. అయితే… పెళ్లాం అనుకోకుండా నెలతప్పింది. దాంతో.. ఆ కండోమ్ కంపెనీపై భర్త కేసు వేశాడు. ఇదీ కథ. ఫ్యామిలీ డ్రామాతో మొదలైన ఈ కథ, కోర్టు డ్రామాతో ముగుస్తుంది. పాయింట్ పరంగా బాగుంది. వెరైటీ కనిపిస్తోంది. కామెడీకి బోలెడంత స్కోప్ ఉంది. ఎమోషన్ పండించడానికీ ఛాన్సుంది. ఇలా.. ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి ప్రమోషన్ పరంగా లోటు ఉండదు. మధ్యతరగతి కుర్రాడి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, రాజేంద్ర ప్రసాద్.. లాంటి నటీనటుల బలం ఈ కథకు ఉంది. సంకీర్తన అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సందీప్ బండ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబరు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.