సుహాస్‌పై ప్రేక్షకులకు ఓ మంచి అభిప్రాయమే ఉంది. తను కచ్చితంగా విభిన్న ప్రయత్నాలు చేస్తాడనది అందరి నమ్మకం. కలర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వరకూ తన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ విషయం అర్థం అవుతోంది. మరోసారి ‘ప్రసన్నవదనం’ అంటూ ఓ కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరోకి ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్. అంటే మొహాల్ని గుర్తించలేడు. ఆఖరికి అద్దంలో తన మొహం కూడా చూసుకోలేడు. చూస్తే.. రకరకాల షేపులు కనిపిస్తుంటాయి. నిజానికి మంచి థ్రిల్లింగ్ పాయింట్ ఇది. దీంతో హిలేరియస్ కామెడీ సినిమా తీయొచ్చు. కానీ ఇదే పాయింట్ పట్టుకొని ఓ క్రైమ్ కథ తీశారు. ప్రసన్నవదనం ట్రైలర్ చూస్తే ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే విషయం అర్థం అవుతుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన చిత్రమిది. మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. మే 3న విడుదల చేస్తున్నారు.
ట్రైలర్ బాగుంది. ముందు సూర్యగా సుహాస్ పాత్రని ప్లజెంట్ గా పరిచయం చేసుకొంటూ, తనకున్న సమస్య చెప్పే ప్రయత్నం చేశారు. తనకో ప్రేమకథ. అంతా ఓకే అనుకొంటున్న సమయంలో సూర్య ఒకటి కాదు, మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న హీరో.. ఆ మర్డర్ కేసుల్లోంచి ఎలా తప్పించుకొన్నాడు, అసలు హంతకుడ్ని చట్టానికి ఎలా అప్పగించాడు? అనేదే కథ. ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. విజువల్స్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఇలాంటి కథలకు అప్పుడూ, ఇప్పుడూ అని కాకుండా ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. పైగా సుహాస్ టైమ్ బాగుంది. సో.. బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితమే వచ్చే అవకాశం ఉంది.