ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఈరోజు సాయంత్రం మళ్ళీ మరో బాంబు దాడి జరిగింది. ఈసారి రష్యన్ ఎంబసీ సమీపంలో బాంబులు పేలాయి. ఒక మోటార్ సైకిల్ పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా వస్తున్న ఒక బస్సును గుద్దుకొని తనను తాను పేల్చి వేసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నలుగురు పౌరులు మరణించారు, 20మందికి పైగా గాయపడ్డారు. దీనితో ఈ కొత్త సంవత్సరంలో 20రోజుల వ్యవధిలో ఆరుసార్లు దాడులు జరిగాయి. ఈదాడికి ఎవరూ బాధ్యులమని ఇంతరవరకు ప్రకటించుకోలేదు కానీ అది తాలిబాన్ ఉగ్రవాదుల పనేనని ఆఫ్ఘన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్, అమెరికా దేశాలు కలిసి దేశంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాలిబాన్లను కూడా ఆ శాంతి చర్చలలో పాల్గొనమని కోరుతున్నాయి. కానీ తాలిబన్లు ఎటువంటి చర్చలలో పాల్గొనేందుకు సిద్దంగా లేరు. కనుక వారే ఈ శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆఫ్ఘన్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.