ఓ ఆత్మహత్య తెలంగాణలో రాజకీయ కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో బోడ సునీల్ నాయక్ అనే నిరుద్యోగి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ… శుక్రవారం చనిపోయారు. ఆత్మహత్యాయత్నం చేసినప్పుడే.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నేతలు.. సహా విపక్ష నేతలందరూ.. సునీల్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే సునీల్ ఆరోగ్యం విషమించడంతో మరణించారు. దీంతో విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించాయి.
బోడ సునీల్‌ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్య అంటూ.. విరుచుకుపడ్డారు. బోడ సునీల్ సూసైడ్ నోట్ కూడా రాశారు. అందులో ప్రభుత్వం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నేరుగానే చెప్పారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలనే డిమాండ్లను విపక్షాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌పై కేసు పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజకీయాల కోసం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో యాభై శాతం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదు..కేసీఆర్ చేసిన హత్య అని బండి సంజయ్ మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. సునీల్ నాయక్ కు నివాళిగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాల పాత్రను ఎవరూ తీసిపారేయలేరు. ఎక్కడికక్కడ యువత ప్రాణాలు అర్పించడంతోనే ఉద్యమం ఎగసి పడింది. ఇప్పుడు అదే తరహాలో ఉద్యోగాల భర్తీ కోసం సునీల్ ఆత్మార్పణం నిప్పు రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు యాభై వేల ఖాళీల భర్తీ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు. త్వరలో భర్తీ.. త్వరలో భర్తీ అనే ప్రకటనలు మాత్రం వస్తున్నాయి. ఈ క్రమంలో బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోవడం… రాజకీయ ఎజెండాను మార్చే అవకాశం కనిపిస్తోంది.