టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న సుజనా చౌదరి భాజపాలోకి ఎందుకు వెళ్లారో తెలిసిందే! చేరిన సమయంలో ఆయన చెప్పిన కారణమేంటంటే… దేశమంతా ప్రధాని మోడీని మరోసారి బలంగా కోరుకుందనీ, అన్ని రాష్ట్రాల్లో మోడీ హవా గతం కంటే రెండింతలైందనీ, దేశం అభివృద్ధి మోడీ చేతుల్లో ఉందని ప్రజలు అంత బలంగా తీర్పు ఇచ్చిన తరువాత… తామూ దాన్నే అంగీకరిస్తూ భాజపాలో చేరుతున్నామన్నారు. అంటే, ప్రజాభిప్రాయాన్ని గౌరవంచి పార్టీ మారుతున్నా అన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన విషయంలో రాజీలేని ప్రయత్నం చేస్తామనే రొటీన్ మాట కూడా అప్పుడూ చెప్పారు! అయితే, ఇప్పుడేమంటున్నారంటే… తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామని నిర్ణయించుకున్నాను కాబట్టే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వచ్చానని కొత్త కారణం చెబుతున్నారు సుజనా చౌదరి.
విశాఖపట్నంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సుజనా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఐదేళ్లలో అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీని నిర్మిస్తామన్నారు. గడచిన 70 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సాధించింది ఏమీ లేదన్నారు. ఎంతసేపూ విమర్శలకూ, నెగెటివిటీకీ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప… ప్రభావవంతమైన నిర్ణయాలంటూ ఏవీ తీసుకోలేదన్నారు! నరేంద్ర మోడీ పాలనను చూసుకుంటే… గడచిన రెండున్నర నెలల్లో చారిత్ర నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తెలుగుదేశంలో ఉండగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనీ, కానీ తాను ప్రజల్లోకి వద్దామని నిర్ణయించుకుని భాజపాలో చేరాను అన్నారు! భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ కాబట్టి, దాన్లో పనిచేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు!! వెంటనే, ఆ మాట కాస్త సర్దుకుంటూ… అంటే, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవాలంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
టీడీపీలో ఉండగా కేవలం పరోక్ష రాజకీయాలే చేశాననీ, ప్రత్యక్ష రాజకీయాలు చేయాలంటే జాతీయ పార్టీలోఉండాలనే అభిప్రాయాన్ని సుజనా చౌదరి వ్యక్తం చేశారు! పార్టీలు మారడం అనేది ఈరోజుల్లో నాయకులకు ఓ అవసరంగా మారిపోయింది. అధికారం అండ లేకపోతే, వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయన్నదే కొంతమందికి ప్రాధాన్యతాంశం. కాబట్టి, పార్టీ మారడానికి గల కారణాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే….. ఇలాగే ఒక్కోసారి ఒక్కో అభిప్రాయం తడబడి బయటకి వచ్చేస్తుంటుంది!! ప్రతీసారీ ఓ కొత్త కారణం చెబితే.. పార్టీ మారడం వెనకున్న అసలు కారణం ప్రజలకు ఇంకా స్పష్టంగా అర్థమౌతూ ఉంటుంది.