సుజనా చౌదరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ పార్టీ హైకమాండ్ నుంచి లీకులు వస్తున్నాయి. ఈ సారి రాయలసీమ రెడ్డి నేతకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కొంత మంది లాబీయింగ్ చేస్తున్నారు. ఎప్పుడూ కోస్తా ప్రాంతానికే పదవి ఇస్తున్నారని ప్రాంత సమీకరణాలు కూడా తీసుకు వచ్చారు. అయితే వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు. పురందేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని సుజనా చౌదరికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
బీజేపీకి ఓ అలవాటు ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే..ఆ పార్టీకి అనుకూలంగా ఇంకా చెప్పాలంటే.. ఆ పార్టీ అభిప్రాయం కూడా తీసుకుని అధ్యక్షుడ్ని నియమిస్తారని అంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో మంచి సంబంధాలు నిర్వహించేవారిని పెట్టేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీపై విరుచుకుపడుతున్న కన్నాను అప్పటికప్పుడు తొలగించి సోము వీర్రాజుకు ఇచ్చారు. ఆయన ప్రో వైసీపీగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునే దశలో పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు.
ఇప్పుడు ఆమెను మార్చాలని అనుకున్నా.. ప్రో వైసీపీ అనే ముద్ర ఉన్న ఎవరినీ ప్రోత్సహించాలని అనుకోవడంలేదు. అందుకే సుజనా చౌదరికి చాన్స్ ఇస్తున్నారని అంటున్నారు. సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన స్థాయికి ఎమ్మెల్యే ఏంటి అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకున్నారు. బీజేపీ పెద్దలకూ సుజనా చౌదరి అంటే సదభిప్రాయం ఉంది. కానీ ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే సంప్రదాయ బీజేపీ నేతలు ఇంకా ఎక్కువ డిజప్పాయింట్ అవుతారు.