రాజధాని ప్రాంత రైతులు భాజపా ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ… ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ముందుగా రైతులంతా సీఎంని న్యాయపరంగా ఓసారి కలవాలని సూచించారు. ఆ తరువాత అవసరమొస్తే రాజధాని ప్రాంత రైతులకు అండగా తాము ఉంటామన్నారు. భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమరావతిలో సాయిల్ టెస్టింగులు గతంలోనే చేశామనీ, వాటికి లోబడి నిర్మాణాలు కట్టుకోవచ్చన్నారు. ముంపు ముప్పు ఉందనీ వరదలు వస్తాయనీ కొందరి వ్యాఖ్యానాలు దురాలోచనతో చేసినవిగానే కనిపిస్తున్నాయన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ఏ రాష్ట్రానికీ కేంద్రం నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ, గత భాజపా ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య పార్టీ భాజపా అన్నారు! అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమైతే, పెద్ద పార్టీగా భాజపా ఇవాళ్ల ఆవిర్భవించిందన్నారు.
రాజధానులు ఎప్పుడూ ఒక రోజులో నిర్మితం కావనీ, హైదరాబాద్ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదన్నారు సుజనా. కాబట్టి, ఆరేళ్లలో అమరావతి అంటే అవ్వదు కదా అన్నారు! రాజధాని ప్రాంతంలో తనకు ఒక్క గజం స్థలం కూడా లేదనీ, వారసత్వంగా తనకు వచ్చిన భూములు కూడా రాజధాని పరిధిలో లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నా కూడా కేవలం నాలుగుసార్లు మాత్రమే అమరావతికి వచ్చానన్నారు. ఎవరికో బినామీగా ఉండాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాబట్టి, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనీ, తన మన కుల మత ప్రాంతాలకు అతీతంగా సెక్యులర్ పార్టీగా భాజపా ఇప్పుడు అవతరించిందన్నారు! కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదనీ అండగా ఉంటామన్నారు.
రాజధాని రైతుల సమస్యని భాజపా ఒక రాజకీయాంశంగా మాత్రమే చూస్తున్నట్టుగా సుజనా వ్యాఖ్యలున్నాయి. రైతులకు అండగా నిలుస్తామని చెప్పడం వరకు ఓకే. కానీ, భాజపా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పార్టీ అని ఇప్పుడెందుకు చెప్పడం..? అతిపెద్ద సెక్యులర్ పార్టీగా అవతరించిందని ఇప్పుడెందుకు కితాబులు ఇచ్చుకోవడం..? భాజపా శక్తినీ గుణగణాలను ఇప్పుడెందుకు గొప్పగా చెప్పుకోవడం..? అతి పెద్ద పార్టీ తమది కాబట్టి, రైతులకు అండగా ఉంటామని చెప్పినట్టుగా ఉందిగానీ… రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఆ పార్టీ పెద్దదిగా చూస్తున్న ధోరణి సుజనా మాటల్లో కనిపించలేదు. సరే, ఏదేమైనా అన్ని పార్టీలతోపాటు భాజపా కూడా అమరావతిపై సానుకూలంగా స్పందించింది, రైతులకు ఆమాత్రం చాలు. ఈ క్రమంలో సుజనా ప్రచారోత్సాహమే కాస్త నాన్ సింక్ అన్నట్టుగా ఉందంతే!