సుజనా చౌదరి. తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నాయకుడు. ఆ పార్టీ కోటాలో కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించిన నాయకుడు. రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కమలతీర్ధం పుచ్చుకున్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసు నుంచి బయటపడేందుకు అధికార పార్టీలో చేరారనే విమర్శలు వచ్చాయి. అయితే సుజనా చౌదరి మాత్రం బీజేపీలో చేరినా చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. రాజధాని మార్పు అంశం తెరపైకి రాగానే ముందుగా స్పందించింది సుజనా చౌదరే. ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి నెల రోజుల పాటు సుజనా చౌదరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పై వొంటికాలిపై లేచారు. అమరావతి రాజధాని మార్చడం ఎవరి తరం కాదని, కేంద్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉందంటూ ప్రతి రోజూ ప్రకటనలు చేశారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశాల్లోను, నిరసన తెలియజేస్తున్న అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలోనూ కూడా తన వాదనను బలంగా వినిపించారు. “అమరావతి మీ సొంత ఆస్తి అనుకుంటున్పారా. ఇక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడికి తరలించేస్తామంటే ఎవరూ ఊరుకోరు” అని ఆవేశంగా ప్రకటనలు చేశారు. అంతే కాదు… అమరావతి రైతుల కోసం తాము ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు. ఇదంతా చూసిన అమరావతి రైతులకు కాసింత ధైర్యం వచ్చింది. అమరావతి తరలిపోకుండా కేంద్రంలో సుజనా చౌదరి చక్రం అడ్డు వేస్తారని ఆశలు పెంచుకున్నారు. తీరా నెల రోజుల తర్వాత పరిస్థితి వేరే విధంగా మారిపోయింది. రాజధాని తరలింపు ఆవేశంగా, ఆగ్రహంగా ప్రకటనలు చేసిన సుజనా చౌదరి ఈమధ్య కిమ్మనడం లేదు. ఎక్కడా ఆయన పలుకే లేదు. హైదరాబాద్ వచ్చినా…. ఆయన సొంత జిల్లాకు వెళ్లినా తన పనులు తాను చక్కపెట్టుకుని పెదవి విప్పకుండా కామ్ అయిపోయారు. సుజనా చౌదరి రాజధానిపై మాట్లాడి దాదాపు నెల రోజులు కావస్తోందని, ఆయన మాట్లాడకుండా ఉండడం వెనుక బీజేపీ అధిష్టానం ఉందని అంటున్నారు. అంటే రాజధాని మార్పు విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాటకు బీజేపీ ఓకే చెప్పినట్లేనని కూడా అంటున్నారు. ఇంతకు ముందు రాజధానిపై ఆవేశంగా మాట్లాడిన సుజనా చౌదరి హఠాత్తుగా మాట్లాడకపోవడం వెనుక ఆయన వెనుక ఉన్న కేసులే అనే వాదన కూడా వస్తోంది. ఈ కేసుల కారణంగానే భారతీయ జనతా పార్టీ రాజధాని విషయంలో సుజనా చౌదరిని కట్టడి చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సుజనా చౌదరి తన వాగ్గాటిని తగ్గించారని, రాజధాని ఎలా పోయానా తాను మాత్రం క్షేమంగా ఉండాలనే తలంపుతోనే ఎలాంటి ప్రకటనలు చేయడం లేదని అంటున్నారు. రాజధాని పోరులో చివరికి రైతులు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వస్తోంది.