తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన చంద్రబాబు ఆంతరంగీకులు సుజనా చౌదరి, సీఎం రమేష్.. తమ మాతృపార్టీ మీద ఏ మాత్రం సానుభూతితో లేరు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలోనూ.. వారు ఏమంత సానుకూలంగా లేరు. ఇప్పుడు పార్టీ మారిపోయాం కాబట్టి.. టీడీపీని అంతం చేయాలన్న పట్టుదలతో వారు ఉన్నారని… టీడీపీ నేతలకు అర్థమైపోతోంది. ఏపీలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలి.. ఎవరెవర్ని.. ఏ కోణంలో.. అడిగితే.. బీజేపీలో చేరుతారు.. అన్న అంశాలపై వారు ఇప్పటికే.. ఓ వైట్ పేపర్ రెడీ చేసుకుని దాని ప్రకారం ఫాలో అయిపోతున్నారు. ఆ పరిణామమే… ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా.
తెలుగుదేశం పార్టీలో వ్యవహారాలన్నీ… సీఎం రమేష్, సుజనా చౌదరి చేతుల మీదుగానే నడిచారు. టీడీపీలో ఇద్దరికీ ఆధిపత్య పోరాటం ఉండేది. ఒకరంటే.. ఒకరికి పడేది కాదు. అందుకే.. చంద్రబాబు జోక్యం చేసుకోలేని పార్టీ వ్యవహారాలు వారికి అప్పగించేవారు. అయితే.. ఇప్పుడు వారు బీజేపీలో చేరిన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది. వారు కలిసి మెలిసి.. తమ మాతృపార్టీపై దండెత్తుతున్నారు. టీడీపీలో ప్రతి నియోజకవర్గ స్థాయి నేతతోనూ వారికి పరిచయాలున్నాయి. ఒట్టి పరిచయం మాత్రమే కాదు… పార్టీ హైకమాండ్ అంటే.. చాలా మందికి వారే. వారు చెబితే.. పదవులు వస్తాయి.. లేకపోతే లేదు. అలాంటి వారు ఇప్పుడు.. బీజేపీలో చేరి… మంచి పదవులు వస్తాయి.. వచ్చేయండని పిలుపునిస్తున్నారు. టీడీపీలో హైకమాండ్‌తో అంత సన్నిహిత సంబంధాలు లేక.. నియోజకవర్గాల్లో పోటీ నాయకత్వం ఉండటంతో… గాడ్‌ఫాదర్‌గా చూసుకుంటారన్న నమ్మకంతో.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల వైపు వెళ్లేందుకు కొంత మంది సిద్ధమవుతున్నారు.
నిజానికి రాజ్యసభ ఎంపీలు.. తమ ఆర్థిక అవకతవకల విషయంలో కేంద్రం చూసీచూడనట్లు ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీలో చేరారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఆ కారణంతో చేరినప్పటికీ.. టీడీపీపై ఇక లైట్‌గా ఉండాల్సిన అవసరం లేదని.. బీజేపీతోనే… సీరియస్‌గా కొనసాగాలని… టీడీపీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. టీటీడీ క్యాడర్లో తమకు పరిచయం ఉన్న వారందర్నీ… బీజేపీలో చేర్పిస్తున్నారు. ముందు ముందు.. ఇది మరింత ఉద్ధృతంగా సాగే అవకాశం కనిపిస్తోంది.