తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి… బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరికి … తన మాజీ బాస్ చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఎంత చిన్నగా అంటే.. చంద్రబాబును సుజనా చౌదరి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమేనని… జమిలీ ఎన్నికలు ఆయన స్థాయి సబ్జెక్ట్ కాదని తేల్చి చెప్పారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై… గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన సుజనా చౌదరి మీడియాతో మాట్లాడిన సమయంలో.. ఈ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో జమిలీ ఎన్నికలు వస్తాయని… మంగళవారం టీడీపీ లీగల్ సెల్ సమావేశంలో… చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో… సుజనా చౌదరి ఈ విషయం స్పందించారు. జమిలి ఎన్నికలు చంద్రబాబు స్థాయి సబ్జెక్ట్ కాదని .. జమిలి ఎన్నికలు ఢిల్లీలో తేలాల్సిన విషయమన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమేనని తేల్చేశారు.
గవర్నర్ ను కలిసి అమరావతి విషయంపై వినతి పత్రం సమర్పించిన సుజనాచౌదరి.. తర్వాత వైసీపీ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. ప్రత్యర్థులపై కక్ష తీర్చుకున్నట్లు వైసీపీ పాలన ఉందని …తాజా పరిస్థితుల్ని విశ్లేషించారు. పోలవరాన్ని ఏపీ జీవనాడని 75 ఏళ్లుగా చెప్పుకుంటున్నామని ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి మరోసారి అయోమయంలో పడిందన్నారు. కిరణ్ హయాంలో 14శాతం తక్కువకు పోలవరం కాంట్రాక్ట్‌ను ఇచ్చి తప్పు చేశారని సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పీపీఏ అనుమతితోనే ప్రాజెక్ట్ చేపట్టిందన్నారు. ఐదేళ్లు టీడీపీ సర్కార్ వృధా చేయడంతో ప్రాజెక్ట్ ట్రాక్ తప్పిందని చెప్పుకొచ్చారు. పోలవరంలో అవినీతి జరిగితే.. విచారణ జరిపి, బాధ్యుల్ని శిక్షించాలి కానీ ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.. ఏపీ సర్కార్ కు సుజనాచౌదరి సూచించారు. వైసీపీ ప్రభుత్వం వరదల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల.. ముంపు లేని గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయని గుర్తు ేచశారు. ప్రత్యర్థుల ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. పోలీస్ వ్యవస్థను రాజకీయ నాయకులు చేతుల్లోకి తీసుకొవద్దన్నారు. ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోందని. వైసీపీ తీరు వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని ..ముఖ్యమంత్రి స్పందించాల్సి ఉందన్నారు.