ప్రాంతీయ పార్టీల మనుగడ, వాటి తీరుతెన్నులపై విశ్లేషించారు భాజపా నాయకుడు సుజనా చౌదరి. ఆ చర్చ ఇప్పుడెందుకు, ఏం సందర్భం ఉంది అనే కదా? ఏం లేదండీ, ఆయన గాంధీ సంకల్ప యాత్ర చేస్తున్నారు. దాన్లో భాగంగా అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఉద్దేశం ఏంటంటే… జాతీయ పార్టీలే ఆంధ్రాకి అవసరం అని చాటి చెప్పడం, భాజపా ఒక్కటే ఏపీకి మేలు చేస్తుందని చాటి చెప్పడం! ఆ సందేశం ఇవ్వడం కోసం ప్రాంతీయ పార్టీలు – వాటి ప్రయోజనాలు – అవసరాలు అనే అంశంపై మాట్లాడారు. అయితే, ఆ మాటల్లో అస్పష్టత ఆయనకి అర్థమైందో లేదో ఆయనకే తెలియాలి!
సుజనా ఏమన్నారంటే… ఒక జాతీయ పార్టీ తప్పిదాల వల్ల అప్పట్లో ప్రాంతీయ పార్టీలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల వల్ల అన్న ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ పెట్టారన్నారు. మన ఆత్మగౌరవం కాపాడారన్నారు. కాలక్రమేణా ఏమైందీ అనేది ప్రజలందరికీ తెలుసు అన్నారు. 1995 నుంచి చూసుకుంటే.. ఇప్పటివరకూ, చంద్రబాబు నాయుడు కుటుంబం వెర్సెస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అన్నట్టుగానే రాజకీయాలు నడిచాయన్నారు. ఇప్పటికైనా తాను చెప్పేది ఒకటేననీ, జాతీయ వాదాన్ని తీసుకుని రావాలనీ, జాతీయ పార్టీల వెంట అందరూ ఉండాలన్నారు. అప్పట్లో అన్నగారు టీడీపీ పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీ అయినా కూడా జాతీయ భావాలతో ఉండేవారన్నారు! ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలది కుటుంబ పాలనే అనీ, దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితీ అలాగే అయిపోతోందన్నారు.
జాతీయ భావం అనేది కేవలం జాతీయ పార్టీల ద్వారా మాత్రమే సాధ్యమా..? అది కేవలం ఒక్క భాజపాకి మాత్రమే ఉన్న పేటెంట్ అన్నట్టుగా సుజనా మాట్లాడుతున్నారు! సరే… సుజనా చౌదరి చెబుతున్న జాతీయ వాదం భాజపాకి మాత్రమే ఉందీ అనుకున్నప్పుడు… గడచిన ఐదేళ్లపాటు అధికారంలో ఉంది కదా, భాజపా పాలిత రాష్ట్రాల పట్ల ఒకలా… భాజపాతో విభేదించిన పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రా లాంటి రాష్ట్రాల విషయంలో మరోలా వ్యవహరించారే! దీన్నే జాతీయ వాదమంటారా..? ఈ ప్రశ్నకు ఈ మధ్యనే భాజపా వాదాన్ని ఔపాసన పడుతున్న సుజనా చౌదరి సమాధానం చెప్పాలి. ఒక రాష్ట్రానికి ఇస్తామన్నవి ఇవ్వని జాతీయ పార్టీకి ఉన్న వాదాన్ని ఏమనాలి? పోనీ, భాజపా నాయకుడిగా ఇప్పుడు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో జాతీయ వాదం పెంచడం కోసం కేంద్రం నుంచి ఏపీ అవసరాలను రాబట్టే ప్రయత్నమేదైనా సుజనా చేస్తున్నారా..? ప్రాంతీయ పార్టీలో ఉంటే నష్టమనుకునే కదా ఆయన జాతీయ పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ వల్ల ఆంధ్రాకి కలిగిన లాభమేంటో ఆయన చెబితే బాగుంటుంది!