పార్క్ హయత్‌లోని సుజనా చౌదరి క్యాంప్ ఆఫీసు సీసీ టీవీ ఫుటేజీ ఎలా లీకయిందనే దానిపై ఇప్పుడు అంతర్గతంగా పెద్ద పంచాయతీ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. సుజనాచౌదరి ఈ విషయాన్ని తన భద్రత కోణంలో కేంద్ర ప్రభుత్వానికి.. హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది. ఎంపీల భద్రతను సీరియస్‌గా తీసుకునే.. కేంద్రం హోంమంత్రిత్వ శాఖ కూడా.. ఈ విషయంలో అంతర్గత విచారణ జరిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల సీసీ టీవీ ఫుటేజీ లీక్ కావడానికి చాన్స్ లేదు. అలా లీకయితే.. ఆ వ్యాపార సంస్థకు ఇబ్బంది. పార్క్ హయత్ యాజమాన్యం కూడా ఆ ఫుటేజీని లీక్ చేయలేదని.. ఏపీ నిఘా వర్గాలు అధికారికంగా లేఖ రాసి సేకరించాయని చెబుతున్నారు.
అయితే.. ఫుటేజీ కావాలని ఓ లేఖ రాసినంత మాత్రాన ఇవ్వరు. అక్కడకు నిందితులు వచ్చారని.. కేసు విచారణకు అవసరం అని చెప్పాలి. అలాగే చెప్పి ఫుటేజీ తీసుకుని ఉంటారని.. ఆ నిందితులు ఎవరు.. పార్క్ హయత్‌లో నిఘా ఎవరిపై పెట్టారు..? నిఘా వర్గాలు తీసుకున్న ఫుటేజీ .. ఓ వర్గం మీడియా చేతికి ఎలా అందింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన భద్రతకు పార్క్ హయత్‌లో ముప్పు ఉందని.. సీసీ టీవీ ఫుటేజీ లీక్ అవగానే గమనించిన సుజనా చౌదరి.. తన సర్వీస్ అపార్ట్మెంట్ అప్పుడే ఖాళీ చేసేశారు. అసలు ఏం జరిగిందన్నదానిపై ఆయన ఆరా తీస్తున్నారు. వ్యక్తుల భద్రతను పణంగా పెట్టేలా .. అదీ కూడా ఓ ఎంపీ స్థాయి వ్యక్తికే ఇలా చేయడాన్ని ఆయన సహించలేకపోతున్నారని అంటున్నారు.
తప్పు ఎవరిదైనా.. వదిలి పెట్టబోనని.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. సుజనా చౌదరి రాజ్యసభ ఎంపీ కావడంతో.. ఆ దిశగా ఆయన ప్రివిలేజెస్ దెబ్బతిన్నట్లు అవుతుంది. ఈ కోణంలోనూ రాజ్యసభ చైర్మన్ ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు.. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్లుగా భావిస్తున్న ప్రభుత్వ నిఘా వర్గాలకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్న చర్చ అమరావతిలో జరుగుతోంది.