ఘరానా మొగుడు సినిమాలో ఓ విజిటింగ్ కార్డు చూపించి… అది కేవలం విజిటింగ్ కార్డు కాదు.. విష్ముమూర్తిచేతిలో భూచక్రం అని చెబితే… హీరో నిజమే అనుకుని అంత కాన్ఫిడెన్స్‌గా ప్రొసీడ్ అయిపోతాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఎంపీ సుజనా చౌదరి ఆంద్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున బెదిరింపులు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పుకుని బదెరింపులకు దిగుతున్నారని.., ఇలాంటి వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. అసలు గొడవేంటి అన్న వివరాలను మెయిల్ చేయాలని కోరారు.
ఆ మెయిల్ అడ్రస్ పేరు.. saveandhrapradesh2022@gmail.com. ఈ మెయిల్ అడ్రస్‌కు .. బెదిరింపులకు గురైన వారి వివరాలు పంపితే మిగతా విషయాలు తాను చూసుకుంటానని సుజనా చౌదరి చెబుతున్నారు. విశాఖలో హయగ్రీవ్ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు.. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేతపై దాడి వంటి విషయాలను సుజనా చౌదరి గుర్తించారు. అయితే సుజనా చౌదరి ఇక్కడ చిన్న షరతు పెట్టారు. అదేమిటంటే.. ముందుగా బెదిరింపులకు గురవుతున్న వారుపోలీసులకు ఫిర్యాదు చేయాలట.
ఆ ఫిర్యాదు కాపీలను కూడా తనకు పంపాలట. మిగతాది తాను చూసుకుంటానంటున్నారు. ఏపీలో ఇలాంటి ఫిర్యాదులు చేయడం.. . చేసి ప్రశాంతంగా ఉండటం… ప్రాణాలు కాపాడుకోవడం అంత సులువైన ప ని కాదని.. సుజనా చౌదరికి ఇంకా అర్థమైనట్లుగా లేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న ఏపీ ప్రజలను కాపాడటానికి సుజనాచౌదరి ఇంకా సరళమైన మార్గాన్ని కనిపెట్లాల్సి ఉంది.