కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో పోరాడకుండా ఓటుకు నోటు కేసు అడ్డు పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. జగన్‌పై వున్న క్విడ్ ప్రో కో కేసుల కోసం బిజెపిని ఆశ్రయించారని టిడిపి ఎదురు దాడి చేస్తుంది. నిజానికి ఈ రెండు కేసులూ నిజమే. కాని ముచ్చటగా మూడో కోణం ఒకటుందని ఇప్పుడు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే గాక టిడిపిలోనూ కొంతమంది ఈ పరిస్థితికి కారణం కేంద్ర మంత్రి సుజనా చౌదరి అని విమర్శించారు. బ్యాంకులకు భారీ ఎత్తున బకాయిలు పడిన సుజన వాటిని ఎలాగో విచారణకు రాకుండా ఇబ్బందుల్లో పడకుండా నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నుంచి బయిటకు వస్తే కక్షదారి మోడీ ప్రభుత్వం ఆయనను వెంటనే ఆయన ఎగవేత కేసులను వెలికి తీసి ఇరకాటంలో పెడుతుంది.తీగలాగితే డొంక కదిలినట్టు మరెన్నొ వ్యవహారాలు బయిటకు రావచ్చు. మరికొంత కాలం ఈ గొడవ లేకుండా చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చాక చూసుకోవచ్చన్నది సుజనా ఆలోచనగా వుందట.ఇలాటి తరుణంలో ఎన్‌డిఎ నుంచి బయిటకు రావడం వంటి పనులు లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయని ఆయన ఎప్పటికప్పుడు ఏదో సర్దిచెప్పి కేంద్రంలో కొనసాగేలా చేస్తున్నారట. ఇప్పుడు కూడా ఆ తతంగం పూర్తయిపోయిందనడానికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనే నిదర్శనమని వారంటున్నారు.