కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉన్న నేరానికి కేంద్రమంత్రికి అరెస్టు వారంటు జారీ కావడం సంచలన విషయమే. ఇలాంటి వారంట్ లు రావడం పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తన స్పందనను తెలియజేశారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉన్నదని ఆయన వెల్లడించారు. కోర్టు వాయిదాలకు తాను స్వయంగా హాజరుకాకపోవడగం అనేది.. ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, కేంద్ర మంత్రిగా పని ఒత్తిడి వలన అలా జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. తన తరఫున తమ వాదనను న్యాయవాదులు కోర్టుకు తెలియజేస్తూనే ఉన్నారని వెల్లడించారు.
మారిషస్ బ్యాంకుకు 106 కోట్ల రూపాయల రుణం ఎగవేసిన కేసులో పూచీ ఉన్న కంపెనీకి డైరెక్టర్లలో ఒకరు అయినందుకు సుజనా చౌదరి మీద ఈ కేసు నడుస్తున్నది. మారిషస్ బ్యాంకుకు రుణం విషయంలో లేనివీ పోనివీ అవాస్తవాలన్ని కలిపి ప్రచారంలో పెడుతూ.. తనను రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారంటూ సుజనా చౌదరి తొలినుంచి చెబుతూనే ఉన్నారు. ఒక రకంగా ఆయన వాదనలో కూడా నిజం ఉంది. ఎటూ రుణం ఎగవేత కేసు ఆయన పేరు చుట్టూ తిరుగుతున్నది గనుక.. ఆయననే ప్రధాన నిందితుడుగా అభివర్ణిస్తూ చాలా ప్రచారమే జరిగింది. అయితే వ్యవహారం కోర్టుకు వచ్చిన తరువాత.. వరుసగా మూడు వాయిదాలకు నోటీసులు పంపుతున్నప్పటికీ సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్టు వారంట్ లు జారీ చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు కాదంటూ దీనికి ఆయన వివరణ ఇవ్వడం విశేషం.
ఈ జవాబు సరిపోతుందా…?
తన అరెస్టుకు న్యాయస్థానం వారంటు జారీ చేస్తే గానీ.. ఈ విషయం మీద తాను స్పందించి.. జాతికి జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నదని పాపం సదరు కేంద్రమంత్రి గారికి గుర్తుకు రాలేదు. ఒకవైపు వంద కోట్లకు పైగా విదేశీ బ్యాంకుకు సొమ్ము ఎగవేసిన కేసులో నిందితుడిగా కోర్టు విచారణను ఎదుర్కొటూ, మరోవైపు కేంద్రమంత్రిగా కొనసాగుతున్న సుజనా చౌదరి.. వ్యవహారం తన అరెస్టు వరకు వచ్చేసరికి.. స్పందిస్తున్నారు. కేసులో నిందితుడు అయినా.. వాయిదాలకు రానందుకు కోర్టు ఆయన పేరిట అరెస్టు వారంటు ఇచ్చింది. అబ్బెబ్బే.. నేనేం కావాలని కోర్టుకు ఎగ్గొట్టలేదు.. పనుల్లో బిజీగా ఉన్నా.. కోర్టు అంటే నాకు చాలా గౌరవం ఉంది అంటూ సుజనా ఇప్పుడు పలాయనం డైలాగులు వల్లె వేస్తున్నారు. కానీ… న్యాయం, చట్టం ఎదుట తన సచ్చీలత నిరూపించుకోకుండా ఇలాంటి డైలాగులు తనని కాపాడవు అని ఆయన తెలుసుకోవాలి.