సుజనాచౌదరి పరిస్థితి ప్రస్తుతం జాలిగొలిపే విధంగా మారిపోతున్నది. అసలే ఆయన మీద కోర్టు కేసులో తెగకుండా పీడిస్తున్నాయి. కనీసం కోర్టు బోను ఎక్కకుండా ఉండడానికి, అరెస్టు కాకుండా ఆ కేసును సాగదీయడానికి ఆయన నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కేంద్రమంత్రిగా ఉంటూ ఆర్థికనేరాలకు సంబంధించిన, మరీ ఘోరంగా బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన కేసులో అరెస్టు అయితే పరువు తక్కువ అని ఆయన భయపడుతున్నారు. ఆయన పరిస్థితి ఇలా ఉంటే.. కొడుకు కార్తీక్ ఇప్పుడు మరో పరువునష్టం పితలాటకం తెచ్చిపెట్టాడు. రాత్రీ పగలూ తేడా లేకుండా అంతో ఇంతో జనసంచారం ఉండే హైదరాబాదు నగరరోడ్లలో హైస్పీడ్ కార్ రేసింగులకు దిగి.. పోలీసు కేసుల్లోకి ఎక్కాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు నగర రోడ్లలో సంపన్నుల పిల్లలైన కొందరు యువత అప్పుడప్పుడూ రాత్రి బాగా పొద్దుపోయాక కార్ రేసులు, బైక్ రేసులు నిర్వహించుకుంటూ ఉండడం చాలా మామూలు విషయమే. కార్ రేసులైతే జనసమ్మర్దంగా ఉండే, అర్ధరాత్రి అయినా అంతో ఇంతో జనసంచారం, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ ఉండే నగర రోడ్లలోనే నిర్వహిస్తుంటారు. జనం వీటినిచూసి బెంబేలెత్తిపోవడమూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆకతాయి కుర్రాళ్లు దొరికినప్పుడు తదనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటుంటారు.
అయితే శుక్రవారం రాత్రి సుజనాచౌదరి కొడుకు కార్తీక్ కూడా ఇదే ఆకతాయి పనికి పాల్పడ్డాడు. ఫ్రెండ్స్‌తో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టునుంచి, తెలుగుదేశం ఆఫీసు వైపు వెళ్లే రోడ్డులో కారు రేసింగులకు దిగాడు. ఇంకా వాహనాలు, జనాల సంచారం తగ్గని రోడ్ల మీద 150 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళుతోంటే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు తక్షణం స్పందించి వచ్చి మూడుకార్లు, పది బైకుల సహా కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను సుజనాచౌదరి కొడుకు అని తెలిసింది. కార్తీక్ వాడిన కారు కూడా సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టరు అయి ఉన్నట్లు గుర్తించారు. ర్యాష్‌డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. సాధారణంగా వీరికి కౌన్సెలింగ్ చేసి పంపేస్తామని పోలీసులు అంటున్నారు.
అంతవరకు బాగానే ఉంది. హెల్మెట్ లేనందుకు, కారు బెల్టుపెట్టుకోనందుకు.. ఇలాంటి పొరబాట్లకు భారీ రుసుములు చలాన్లుగా వసూలు చేసే పోలీసులు.. కేవలం పొగరు, నిర్లక్ష్యం, ఇతరుల ప్రాణాల పట్ల లక్ష్యంలేని వైఖరితో ఇలాంటి కార్ రేసులకు పాల్పడే వారిని మాత్రం కేవలం కౌన్సెలింగ్‌తో వదిలేయడం టూమచ్ అని జనం భావిస్తున్నారు.