ఓ విధంగా తమిళనాడు జల్లికట్టు ప్రభావంతోనే ఆంధ్రాలో మరోసారి ప్రత్యేక హోదా ఉద్యమం రగులుకుందని చెప్పాలి. చట్టవ్యతిరేకమని జల్లికట్టును నిషేధించినా తమిళులు సాధించుకున్నప్పుడు.. చట్టప్రకారం రావాల్సిన హోదా మనకెందుకు రాదు… అనే ప్రశ్న ఆంధ్రాలో పోరాటం పునః ప్రారంభానికి బీజమైంది. అదే మాట జగన్ చెప్పారూ… అదే బాటలో పవన్ కూడా స్పందించారు. దీంతో యువతరం ఉవ్వెత్తున పిలుపునందుకుంది. ఈ తరుణంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించిన తీరు చాలా విచిత్రంగా ఉంది! “జల్లికట్టు స్ఫూర్తి అయితే వెళ్లి ఆడుకోవాలి. జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే కోళ్ల పందాలో.. లేదా, ఏదో పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికీ దీనికీ సంబంధం లేదు” అని సుజనా చౌదరి నిష్కర్షగా చెప్పారు!
జల్లికట్టుతో ప్రత్యేక హోదా ఉద్యమ పోలిక సరైందా కాదనేది కాసేపు పక్కనపెడితే… ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తిని ఏ కోళ్లపందాలతోనో మరీ దారుణంగా పందుల పందాలతోనో పోల్చే అర్హత సుజనా చౌదరికి ఉందా అనేది పలువురు ప్రశ్న. కేంద్రమంత్రిగా ఇన్నాళ్లుగా ఢిల్లీలో ఉన్నారే… ప్రత్యేక హోదాపై ఎప్పటికప్పుడు కేంద్రంలో ఏం జరుగుతుందో చూస్తూ వచ్చారే… హోదా కోసం ఆయన ఏం చేసినట్టు అంటూ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇస్తామన్న ప్రత్యేక హోదాను కేంద్రం నీరుగారుస్తూ పోతూ ఉంటూ… ఈయన మౌనంగా ఢిల్లీలో ఎందుకున్నట్టు అని మరికొంతమంది నిలదీస్తున్నారు.
సరే, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం దగ్గర చంద్రబాబు ఏ పరిస్థితుల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చిందనేదానిపై చాలా ఆరోపణలున్నాయి..! ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చాకనే హోదా కాస్తా ప్యాకేజీగా రూపాంతరం చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందీ అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టే, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయారే అనుకుందాం..!
కాని, కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి ఒక ఆంధ్రుడిగా స్పందించారా..? ఎప్పుడూ కేంద్రంలోని భాజపాకు భజన చేయడమే తప్ప… ప్రత్యేక హోదాపై ఆంధ్రుల మనోభావం ఇలా ఉందీ అని కేంద్రానికి గట్టిగా చెప్పగలిగారా..? హోదా విషయంలో ఇన్నాళ్లూ ఏ బాధ్యతా లేకుండా ప్రవర్తించి… ఇప్పుడు ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తిని పందుల పందాలతో పోల్చేంత అర్హత సుజనాకి ఉందా అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో… “ఒకవేళ ప్రజల పోరాట వల్ల హోదా వస్తే… తమకీ రుణమాఫీ ఉంటుంది లెండీ మంత్రిగారూ” అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు కూడా! నచ్చితే మద్దతు ప్రకటించాలి. నచ్చకపోతే వ్యతిరేకించాలి. అంతేగానీ… ఇలా వెక్కిరించకూడదు కదా..!