రాజ్యసభ మాజీ ఎంపీ సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. ఆయన విజయవాడపై దృష్టి పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పొత్తు ఉంటుందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆయన పోటీకి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. పొత్తులు లేకపోతే తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అయితే ఇప్పుడు కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల వరకూ సుజనా చౌదరి టీడీపీలో అత్యంత కీలకంగా పని చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కసరత్తులో ఆయనది కూడా కీలక పాత్ర. అయితే టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. అప్పట్నుంచి పెద్దగా సంబంధాల్లేవు. నారా లోకేష్ తో ఆయన సమన్వయం పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన బీజేపీలో చేరిపోయారని చెబుతారు.
అమరావతి విషయంలో సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. ఈ ఇమేజ్ కూడా పనికి వస్తుందని.. సామాజికవర్గ పరంగా కూడా బాగుంటుందని విజయవాడ నుంచి పోటీకి సుజనా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే సుజనా చౌదరి టీడీపీలో చేరే అంశంపైనే సందిగ్ధత నెలకొంది. పార్టీ ఓడిపోయిన తర్వాత వెళ్లిపోయి.. ఇప్పుడు మళ్లీ బాగుందని అనుకున్నప్పుడు వచ్చే వారికి ఎలా చాన్సిస్తారన్న చర్చ జరుగుతోంది. విజయవాడ పార్లమెంట్ సీటు కోసం చాలా రోజులుగా కేశినేని చిన్ని పని చేసుకుంటున్నారు. లోకేష్ ఆయనకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.