బ్యాంకులకు వందల కోట్ల రుణాలను ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్న సుజనా చౌదరి.. బీజేపీలో చేరిన తర్వాత కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. కానీ ఆయనకు నోటీసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా రుణాల రికవరీ ట్రైబ్యునల్ ఆయన భార్య పద్మజకు నోటీసులు జారీచేసింది. చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది. పద్మజతో పాటు సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్‌కు చెందిన మరికొందరికి ఈ నోటీసులు వెళ్లాయి. పదహారో తేదీన వారు.. డీఆర్టీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది.
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో సుజనా చౌదరి అత్యంత కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు.. ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ.. టీడీపీ … కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం.. సుజనా చౌదరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు అనేక రకాలుగా నోటీసులు వచ్చాయి. ఆయన కంపెనీలపై.., పలుమార్లు సీబీఐ, ఐటీ సోదాలు జరిగాయి. సూట్ కేసు కంపెనీలతో వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని.. సీబీఐ, ఐటీ, ఈడీ.. మీడియాకు సమాచారం కూడా ఇచ్చాయి. ఓ సారి చెన్నైకి పిలిపించి మూడు రోజుల పాటు విచారణ జరిపారు. మరోసారి బెంగళూరు ఐటీ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. కోర్టుకు వెళ్లి సుజనా చౌదరి రిలీఫ్ పొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఊపిరి పీల్చుకున్నారు.
ఆయనకు ఇప్పుడు నోటీసులు రావడం లేదు. సీబీఐ పిలవడం లేదు. ఈడీ పట్టించుకోవడం లేదు. ఐటీ అధికారులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ… బ్యాంకులు మాత్రం.. తమ బాకీల వసూలు కోసం.. డెట్ రికవరీ ట్రైబ్యునల్‌కు వెళ్తున్నాయి. అక్కడ్నుంచి నోటీసులు వస్తున్నాయి. అక్కడ కూడా సుజనా కు రాలేదు. ఆయన భార్యకు వచ్చాయి. బీజేపీ పెద్దలకు సుజనా దగ్గరే కాబట్టి.. ఎలాగోలా కవర్ చేసుకుంటారన్న అభిప్రాయం.. సహజంగానే అంతటా వ్యక్తమవుతోంది.