కేంద్ర మంత్రి సుజనా చౌదరి హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు. మారిషస్ బ్యాంక్ అప్పు ఎగవేతకు సంబంధించి తనపై నాంపల్లి 12వ అదనపు సీఎంఎం కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరుకానందుకు కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంటును కొట్టివేయాలని దానిలో కోరారు. తను సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ దాని రోజువారి ఆర్దికలావాదేవీలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, కనుక ఆ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న హెస్తియా లిమిటెడ్ మారిషస్ బ్యాంకుకి చెల్లించవలసిన రూ.106 కోట్ల బాకీతో కూడా తనకు ఎటువంటి సంబందమూ లేదని సుజనా చౌదరి తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న తనపై ఈవిధంగా ఒత్తిడి తేవడం ద్వారా మారిషస్ బ్యాంక్ తన సమస్యని పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తోందని కనుక తనపై ఆ బ్యాంక్ పెట్టిన కేసును కొట్టివేసి, అలాగే ఈ కేసులో తనపై జారీ చేసిన అరెస్ట్ వారెంటును కొట్టివేయాలని సుజనా చౌదరి హైకోర్టుని కోరారు. ఆయన వేసిన పిటిషన్ని హైకోర్టు ఇవ్వాళ్ళ విచారణకు స్వీకరించవచ్చును. ఒకవేళ హైకోర్టు ఆయన అభ్యర్ధనను మన్నించి ఆయనపై మారిషస్ బ్యాంక్ వేసిన కేసును కొట్టివేసినట్లయితే, అరెస్ట్ వారెంటుని కూడా రద్దు చేయవచ్చును. అలాకాక కేవలం అరెస్ట్ వారెంట్ పై స్టే మంజూరు చేసినట్లయితే, ఈ కేసులో ఆయన నాంపల్లి కోర్టుకి హాజరుకాక తప్పదు.
సుజనా సంస్థలు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నందున వాటి ఆర్దికలావాదేవీలపై సిబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ హరేన్ రావాల్ అనే పిటిషనర్ సుప్రీం కోర్టులో ఒక పిటిషనర్ వేశారు. కానీ ఆ అక్రమ లావాదేవీలపై ఈడి లేదా ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్థకి నేరుగా పిర్యాదు చేయమని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించడంతో హరేన్ రావాల్ అందుకు అంగీకరించి నిన్న తన పిటిషన్ని ఉపసంహరించుకొన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరిపై ఇటువంటి అభియోగాలు రావడం ఆయనకి, తెదేపా పార్టీకి, చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడికి అందరికీ చాలా ఇబ్బందికరమే. కానీ ఎవరూ కూడా దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. చివరికి ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో..దాని వలన ఆయన రాజకీయ జీవితంపై ఎటువంటి ప్రభావం పడుతుందో చూడాలి.