కేంద్ర మంత్రి సుజనా చౌదరి తన పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. మారిషస్ బ్యాంక్ కి ఆయన సంస్థ రూ.106 కోట్లు బాకి ఎగవేయడం, దానిపై ఆయనకి న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తగులుతుండటం, ఇటీవల నాంపల్లి కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం వంటివన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, తెదేపాకు చాలా అప్రదిష్ట కలిగించేవిగా ఉన్నాయి. అయినా కూడా సుజనా చౌదరి ఈ సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా దానితో తనకేమీ సంబంధం లేదని వాదిస్తుండటంతో కేంద్రప్రభుత్వం, తెదేపా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది.
దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో భాజపా ప్రధానంగా ‘అవినీతి’ అంశాలపై గట్టిగా మాట్లాడుతోంది. కానీ అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్న కారణంగా ప్రతిపక్షాల ప్రతివిమర్శలకు, ముఖ్యంగా మీడియాకు సమాధానాలు చెప్పుకోలేక చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కనుక ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయమని కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూచించినట్లు తెలుస్తోంది.
సుజనా చౌదరి వ్యవహారం పట్ల చంద్రబాబు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే ఆయన స్థానంలో తెలంగాణాలో సీనియర్ తెదేపా నేత మరియు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుని కేంద్ర మంత్రిగా చేయాలని నిశ్చయించుకొన్నట్లు తాజా సమాచారం. తద్వారా రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి కోసం ఆంధ్రాలో పార్టీ నేతల ఒత్తిళ్ళనుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంతే కాక తెలంగాణాలో తెదేపా నేతలకు భరోసా కల్పించినట్లవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరికీ కూడా గరికపాటి పట్ల సదాభిప్రాయమే ఉంది. తెలంగాణాలో పార్టీ నేతలందరికి కూడా ఆయన పట్ల సదాభిప్రాయమే ఉంది. అందుకే సుజనా చౌదరి స్థానాన్ని ఆయనతో భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రాలో ఆ పదవి ఆశిస్తున్నవారందరికీ ఇది చాలా నిరాశ కలిగించే విషయమే.