రాజధానిని కదిలిస్తే.. కేంద్రం చూస్తూ ఊరుకోదంటూ.. నిన్నామొన్నటి దాకా రోజూ చెప్పుకొచ్చిన సుజనా చౌదరి.. ఇప్పుడు.. రాజధాని మార్చవద్దంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు. మంగళవారం.. పది పేజీలతో.. ఓ సుదీర్ఘ లేఖ రాసి ..మీడియాకు కూడా ఇచ్చారు. ఇందులో.. అమరావతికి జగన్ అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసిన విషయం దగ్గర్నుంచి… అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు వరకూ ప్రతి విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జరుగుతున్న రూ. 42వేల కోట్ల విలువైన పనుల్ని నిలిపివేశారని.. దానికి కారణం లేదనన్నారు.
లేఖలో సుజనా చౌదరి.. కొన్ని హెచ్చరికల్లాంటి.. విషయాలను జగన్ కు చెప్పారు. అందులో మొదటిది.. రాజధాని తరలింపు వల్ల ఏపీపై ఆర్థికంగా పడే భారం. నిర్మాణాలు.. ఇప్పటి వరకూ ఖర్చయిన మొత్తం కాకుండా.. రాజధాని తరలిస్తే.. రైతులకు చెల్లించాల్సిన పరిహారం.. రూ. లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలని సుజనా లెక్క చెప్పారు. చెట్టును రక్షిస్తే అది మనకు నీడనిస్తుంది.. అమరావతిని రక్షిస్తే అది రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందన్నారు. రాజధానిపై చేసిన అనేక ఆరోపణలన్నీ అవాస్తవాలేనని.. ఇప్పటికీ ఆరోపణలే చేస్తున్న ప్రభుత్వం.. నిరూపించలేకపోయిందన్నారు. అలాగే.. అమరాతికి రూ. లక్ష కోట్లు అవుతుందంటూ.. ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాదన్నారు.
బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిసినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకే వేస్తున్నారు. నేరుగా సుజనా చౌదరి.. తాను లేఖలో రాసిన అంశాలన్నింటినీ పలుమార్లు మీడియా సమావేశాల్లో చెప్పారు కూడా. ఇప్పుడు వాటినే లేఖ రూపలో జగన్కు పంపారు. అయితే.. కొత్తగా ఈ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. రాజధాని తరలింపు వల్ల రాష్ట్రం ఆర్థిక చిక్కుల్లో పడుతుందని… కకావికలం అవుతుందన్న ముందస్తు అంచనాతో.. తర్వాత తాము హెచ్చరించినా.. జగన్ పట్టించుకోలేదన్న కారణం చెప్పడానికి.. సుజనా ఇలాంటి లేఖను అధికారికంగా రాశారన్న ప్రచారం జరుగుతోంది.