తమ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే సమయంలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్థానిక నేతల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం కొత్తగా తీసుకుంటున్న నాయకులను, వారితో వైరం ఉన్న తన పార్టీలోని పాత నాయకులను కలసి కూర్చోబెట్టి.. వారి మధ్య సయోధ్య కుదిర్చి అందరమూ కలిసి పార్టీ ఎదగడానికి పనిచేద్దాం.. అనే తరహా రాజీ ప్రయత్నాలు కూడా చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మోనార్క్లాగానే వ్యవహరించారు. తాను చేర్చుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను గనుక.. పార్టీలో ఉన్న వారంతా మౌనంగా భరించాల్సిందే అన్నట్లుగా వెళ్లిపోయారు. అలాంటి ఒంటెత్తుపోకడల దుష్ఫలితాలు ఏమిటో ఇప్పుడు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ఆకర్ష పథకం ముమ్మరంగా ఉన్న ఈ కీలక సమయంలో.. కొన్నాళ్లుగా ఇలాంటి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ‘పచ్చబాట’ పడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బొత్స సత్యనారాయణను చేర్చుకోవడం అనే నిర్ణయం విజయనగరం జిల్లా వైకాపా రాజకీయాల్లో ముసలం పుట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు అయిన సుజయకృష్ణ రంగారావు దీనిపై అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీనుంచి వెళ్లిపోతారనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్లకు జగన్ పిలిచి బుజ్జగించారు. కానీ ఇప్పుడు తెదేపా ఆకర్ష మంత్రం వారి మీద పనిచేసినట్లుంది.
తాజాగా ఆయన మంగళవారం విజయవాడకు వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 15 లేదా 17న ముహూర్తం నిర్ణయించుకుని పార్టీలోకి వస్తానంటూ చంద్రబాబుకు సమాచారం ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. జ్యోతుల తరహాలోనే… బొబ్బిలినియోజకవర్గ పరిధిలోని యావత్ వైకాపా కేడర్‌తో సహా తెదేపాలోకి వస్తానని సుజయకృష్ణ రంగారావు చంద్రబాబు తో చెప్పినట్లు తెలుస్తోంది.
వైకాపా పరిస్థితి మరీ దయనీయంగా మారిపోతోంది. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తెదేపా వారితో టచ్‌లోనే ఉన్నారన్న మాట వాస్తవం. ఒక్కొక్కటిగా అన్నీ బహిరంగ రహస్యాలు అవుతాయి.