బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు వైకాపా శ్రీకాకుళం ఇన్-చార్జ్ బేబీ నాయిన, వారి అనుచరులు రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. ఇంతవరకు వారిపట్ల గౌరవంగా వ్యవహరించిన వైకాపా వారు పార్టీని వీడి వెళ్ళిపోవడం ఖాయం అని గ్రహించగానే వారు పదవులకి ఆశపడే పార్టీ మారుతున్నారని ఆరోపించడం మొదలుపెట్టింది. సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి, పార్టీలో కీలక పదవి తెదేపా ఆఫర్ చేసినట్లు సాక్షిలో వ్రాసింది. నిజానికి ఆయన మంత్రి పదవికి ఆశపడి ఉండి ఉంటే, 2014 ఎన్నికలలో వైకాపా ఓడిపోగానే తెదేపాలో చేరిపోయుండేవారు. బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవద్దని వారు ఎంతగా కోరినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వారి మాటను ఖాతరు చేయకుండా చేర్చుకొన్నారు. అప్పటి నుంచి వారిరువురూ చాలా అసంతృప్తిగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ అసంతృప్తితోనే వారు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు తప్ప మంత్రిపదవులకు ఆశపడి కాదని వైకాపాకి కూడా తెలుసు. ఒకవేళ మంత్రిపదవికి ఆశపడినా కులసమీకరణాలు, సీనియారిటీ, మంత్రివర్గానికున్న పరిమితులు వంటి అనేక కారణాల చేత కొత్తగా పార్టీలో చేరుతున్న సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదనే చెప్పవచ్చును.
విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ వారిరువురికీ చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పించారు. బొత్స సత్యనారాయణతో వేగలేకనే వారిరువురూ కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలోకి వస్తే, మళ్ళీ అక్కడ కూడా వారికి ఆయన బాధ తప్పలేదు. జిల్లాలో వైకాపా చాలా బలంగా ఉన్నప్పటికీ బొత్సను పార్టీలో చేర్చుకోవడం అంటే తమ పనితీరు బాగోలేదని ఆక్షేపించినట్లేనని వారు భావించారు. అప్పటి నుంచే బొబ్బిలి రాజులిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ అసంతృప్తితోనే వైకాపాని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పవచ్చును. ఇది జగన్ స్వయంకృతాపరాధమే తప్ప తెదేపా తప్పు కాదు. వారు వెళ్ళిపోవడం ఖాయం అయిపోయింది కనుక ఇంతవరకు బేబీ నాయిన నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్-చార్జ్ పదవికోసం వైకాపాలో మళ్ళీ కుమ్ములాటలు మొదలవుతాయేమో?