సాహో తరవాత.. సుజిత్ ఖాళీగానే ఉన్నాడు. లూసీఫర్ రీమేక్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మరో రీమేక్ తనని వెదుక్కుంటూ వెళ్లింది. అయితే దానికి తనకు తాను `నో` చెప్పేశాడు.
ప్రభాస్ – రాజమౌళిల ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఈసినిమాకి ఓ సౌత్ ఇండియన్ దర్శకుడినే తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చర్చించిన పేరు… సుజిత్. తాను తీసిన సాహో దక్షిణాదిన పెద్దగా ఆడకపోయినా… నార్త్ లో మంచి వసూళ్లు అందుకుంది. అందుకే సుజిత్ ని సంప్రదించారు. అయితే సుజిత్ ఈ సినిమా రీమేక్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పైగా యూవీ క్రియేషన్స్‌లో సుజిత్ మరో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. సాహో తరవాత.. యూవీతోనే సినిమా చేయాలన్నది ఎగ్రిమెంట్. ఓ కథ రెడీ చేసి, హీరోని వెదికి పట్టుకునే పనిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే.. జనవరి నుంచి ఈ సినిమా మొదలు కావొచ్చు. `ఛత్రపతి` రీమేక్ కూడా జనవరిలోనే పట్టాలెక్కాలి. అందుకే… సుజిత్ ఈ సినిమాని వదులుకోవాల్సివచ్చిందని టాక్. సుజిత్ చేయని పక్షంలో ప్రభుదేవా, వినాయక్ లని సంప్రదించాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.