ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ..ఈడీ అంతా సైలెంట్ అయిపోయింది. కవిత కూడా బీజేపీని చీటికి, మాటికి విమర్శించడం లేదు. అయితే జైల్లో ఉన్న మనీలాండరింగ్ కింగ్ సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం కవితను టార్గెట్ చేసుకుని అదే పనిగా లేఖలు రాస్తున్నారు. ఆమెను కవితక్కగా పిలిచే సుఖేష్ ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా కవితకు చెందిన షెల్ కంపెనీల గురించి ఆయన ఓ లేఖ విడుదల చేశారు.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కవిత సంబంధించిన షెల్ అకౌంట్ల నుంచి ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్ కజిన్కు చెందిన ‘గ్రీన్ హస్క్’ అనే మారిషస్ కంపెనీకు కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు మూడు విడతతలుగా రూ.80 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసినట్లు సుఖేశ్ చెప్పాడు. ఈ డబ్బును యూఎస్ బీసీ, క్రిప్టో కరెన్సీకి మార్చిన అనంతరం కేజ్రీవాల్ సూచనల మేరకు అబుధాబికి పంపినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు సుఖేశ్ చంద్రశేఖర్ తన అడ్వకేట్ అనంత్ మాలిక్ ద్వారా బుధవారం నాలుగు పేజీల లేఖను రిలీజ్ చేశాడు.
ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ తో జరిపిన ‘ఫేస్ టైమ్’ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను త్వరలో విడుదల చేస్తానన్నాడు. ఈ లేఖలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై మరోసారి ఆరోపణలు చేశాడు. ఆ ఇంటి ఫర్నిచర్కు అయిన ఖర్చును తానే భరించానని, అందుకు సంబంధించిన బిల్లులు కూడా తన దగ్గర ఉన్నాయన్నాడు. వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను జైలులో కొందరు అధికారుల ద్వారా మానసికంగా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. జైలు నుంచి ఎవరైనా లేఖలు విడుదల చేయాలంటే అంత సులువు కాదు. కానీ సుకేష్ మాత్రం సులువుగా లేఖలు విడుదల చేస్తున్నారు. ఇందులో కవితకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడిస్తున్నారు.
సుకేష్ లేఖలు విడుదల చేసిన ప్రతీ సారి కవిత స్పందిస్తున్నారు. తప్పుడు ప్రచారం అంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఆమె స్పందించడం లేదు. ఇప్పుడు ఈ లేఖ విషయంలోనూ ఆమె స్పందించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది.