దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదనే సామెత మనకు ఉండనే ఉంది. నిజానికి ఏదో కాస్త ప్రసాదం పుచ్చుకుని కడుపు నింపుకుంటే చాలుననుకునే నిర్భాగ్యులకు దేవుడు కరుణించకపోయినా పర్లేదు పూజారి మాత్రం కరుణిస్తే అంతే చాలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా అంతే నిర్భాగ్య స్థితిలోనే ఉన్నాయి. సాక్షాత్తూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రసంగంలో తమ గురించి పెద్దగా ప్రస్తావించకపోయినప్పటికీ.. కనీసం దక్షిణ మధ్య రైల్వే జీఎం అయినా ప్రకటించడం కాస్త ఊరట అనుకోవాలి.
నిజానికి రైల్వే మంత్రి ప్రసంగం కూడా అసమగ్రంగా సాగిందనే అనుకోవాలి. అయన ఫుల్స్టాప్ పెట్టారో, కామా పెట్టారో తెలియకుండానే ప్రసంగం ముగిసిపోయింది. అక్కడికి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోయిందనే వాదన వచ్చింది. చివరికి అంతో ఇంతో విదిలించారని లెక్కలు చూసే సరికి తెలంగాణకు 400, ఆంధ్రప్రదేశ్‌కు 250 కోట్ల వరకు విదిలించినట్లుగా లెక్కలు తేలాయి.
అప్పటికీ అన్యాయమే అని జనం అనుకుంటూ ఉండగా.. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మరి కొన్ని కేటాయింపులు కూడా ఉన్న సంగతిని సౌత్ సెంటల్ రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ప్రకటించారు. ఆయన మాటల ప్రకారం.. తెలంగాణకు ఖాజీపేట వర్క్‌షాపును 269 కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి చేయబోతున్నారు. చర్లపల్లిలో 90 కోట్ల రూపాయల వ్యయంతో శాటిలైట్ టర్మినల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలాగే ఏపీకి కూడా కొన్ని కేటాయింపులు ఉన్నాయి. నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు 90 కోట్ల రూపాయలు కేటాయించారు. తిరుచానూరు స్టేషన్ ఏర్పాటుకు 10 కోట్లు, తిరుపతి స్టేషన్ ఆధునికీకరణకు పది కోట్లు కేటాయించారు. గుంటూరు-గుంతకల్ మధ్య కూడా కొత్త రైల్వే లైను వస్తుందని కూడా గుప్తా తెలిపారు.
అయితే ఇవన్నీ పూజారి ప్రకటించిన వరాలే. వీటిలో ఏవి ఎప్పటికి సాకారం అవుతాయో దేవుడి కరుణ సంగతి కూడా తేలితే తప్ప క్లారిటీ రాదు. పూజారి ప్రకటించిన కేటాయింపులు అన్నీ కలిపి లెక్కతీసినా కూడా.. తెలంగాణతో పోలిస్తే.. ఏపీకి చాలా తక్కువ మాత్రమే దక్కడం గమనార్హం.