రామ్‌చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్‌కి ముహూర్తం కుదిరింది. ఈనెల 20న షూటింగ్ ప్రారంభించేస్తున్నామని చిత్రబృందం ప్రకటించేసింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాని జులైలోపుగా పూర్తి చేస్తార్ట. అంటే… షూటింగ్ టైమ్ 4 నెలలు మాత్రమే. అంకెల ప్రకారం 120 రోజులు కనిపిస్తున్నా, షెడ్యూలుకీ షెడ్యూలుకీ మధ్య భారీ గ్యాప్ ఉంటుంది. ప్రతీ పది హేను రోజులకూ ఓ వారం రోజులైనా గ్యాప్ తీసుకోవడం కామన్. దాంతో.. సుక్కు జులై కల్లా ఈ సినిమాని పూర్తి చేయగలడా?? అనిపిస్తుంది. నిజంగానే సుకుమార్ అనుకొన్న సమయానికి సినిమాని సిద్ధం చేస్తే అది సూపరే. ఎందుకంటే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ. దానికి తోడు 20 యేళ్ల క్రితం వ్యవహారం. అప్పటి సెటప్ చూపించాలంటే.. సెట్స్‌పై ఆధారపడక తప్పదు. ప్రతీ సీన్ ఆచి తూచి తీయాలి. అందుకే షూటింగ్‌కి ఎక్కువ రోజులు కేటాయిస్తారనుకొన్నారంతా. కానీ.. సుకుమార్ మాత్రం జులై ఆఖరి వారానికి డెడ్ లైన్ పెట్టుకొన్నాడట.
సుక్కులాంటి దర్శకులు చాలా పెర్ ఫెక్షనిస్టులు. తాము అనుకొన్న అవుట్ పుట్ వచ్చేంత వరకూ సినిమాని చెక్కుతూనే ఉంటారు. పైగా సుకుమార్‌కి సెట్లో సీన్లు మార్చేసే అలవాటు ఉంది. ఆయన తీరుకి.. స్పీడుకి జులై నాటికి సినిమా పూర్తి చేయడం వింతే మరి. కాకపోతే.. ఎట్టిపరిస్థితుల్లోనూ సెప్టెంబరులో ఈ సినిమాని విడుదల చేయాలని చరణ్ ఫిక్సయిపోయాడట. చరణ్ కోసమే సుక్కు కాస్త స్పీడప్ అవుతున్నాడని తెలుస్తోంది. సో.. ఈ దసరాకి చరణ్ సినిమా బరిలో ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది.