అభిమానులకు చిరంజీవి గొప్పే. కాని రాజకీయాల్లో మాత్రం ముమ్మాటికీ చిరంజీవి కంటే గొప్ప నాయకులు వున్నారు. ముఖ్యమంత్రులుగా ప్రజలకు సేవ చేసినవాళ్లు వున్నారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజలకు వినోదం అందించారు. సినిమా హీరోలను, రాజకీయ నాయకులను పోల్చి చూడటం తగదు. కానీ, రెండిటినీ దర్శకుడు సుకుమార్ పోల్చారు. ఆదివారం రాత్రి విశాఖలో జరిగిన ‘రంగస్థలం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కంటే చిరంజీవి పదవే గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి నా అభిమాన నటుడు అని పేర్కొన్నారు.
‘రంగస్థలం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో ఈ విషయం ప్రస్తావిస్తున్నందుకు చిరంజీవిగారికి సారీ అంటూనే దర్శకుడు సుకుమార్ ఆయన రాజకీయ ప్రవేశం గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీతో జరిగిన ఒక సంభాషణను బయట పెట్టారు. ‘ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే గొప్పది కదా. ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు’ అని దేవిశ్రీ అన్నాడని వేదిక మీద గుర్తు చేశారు. “ఎంతమందికి ఎన్ని పదవులైనా ఉండొచ్చు కాని చిరంజీవి పదవి అనేది చాలా ప్రత్యేకం. అది ఆయన ఒక్కరికే సాధ్యం” అని సుకుమార్ వ్యాఖ్యానించారు. చిరంజీవిపై ఆయనకున్న అభిమానాన్ని చూపించుకోవడానికే సుకుమార్ చిరంజీవి పదవి ప్రత్యేకమని చెప్పడం బాగుంది. బట్, ముఖ్యమంత్రి పదవిని చిరంజీవితో పోల్చడం, తక్కువ చేయడం సబబు కాదేమో అని కొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. అందులోనూ చిరంజీవి రాజకీయ ప్రస్థానంపై ఎన్ని విమర్శలు వున్నాయో అందరికీ తెలిసిందే.