మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య… దాదాపుగా యంగ్ స్టార్ హీరోస్ అందరితోనూ దర్శకుడు సుకుమార్ సినిమాలు చేశారు. రామ్ చరణ్ హీరోగా ఆయన తీసిన ‘రంగస్థలం’ ఈ నెల 30న విడుదలవుతోంది. దాంతో ఈ జనరేషన్ యంగ్‌స్టర్స్‌ని మ్యాగ్జిమమ్ కవర్ చేసినట్టే లెక్క. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరితోనైనా ఆయనకు సినిమా చేయాలని వుందా? అంటే ప్రభాస్‌తో చేయాలని వుందన్నారు. “దాదాపు యంగ్ హీరోలు అందరితో చేశా. ప్రభాస్‌తో చేయాలని వుంది. ఏమో… ఏం జరుగుతుందో? చూడాలి” అని సుకుమార్ చెప్పారు. మల్టీస్టారర్ సినిమాలకూ సిద్ధమన్నారు ఒకప్పటి ఈ లెక్కల మాష్టారు. అయితే… మల్టీస్టారర్ సినిమాల్లో ఎన్నో కష్ఠాలు వుంటాయని అంటున్నారు. “రాజమౌళిగారు మల్టీస్టారర్ సినిమా మొదలుపెట్టారు కదా! అందులో చాలా సాధకబాధకాలు వుంటాయి. ఆ హీరోల స్థాయి, అభిమానులు.. ఇలా ప్రతి ఒక్కరినీ, ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాలి. తారక్, చరణ్‌లా ఎవరైనా హీరోలు ముందుకొస్తే నాకూ మల్టీస్టారర్ తీయాలని వుంది” అని మనసులో మాటలను బయటపెట్టారు సుకుమార్.