దర్శకుడు సుకుమార్ దగ్గర ‘రంగస్థలం’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం. కీరవాణి కుమారుడు సింహా సహాయ దర్శకుడిగా పని చేశాడు. ‘సంగీత దర్శకుడి కుమారుడు సంగీతంలోకి కాకుండా దర్శకత్వంలో వచ్చాడేంటి?’ అని ఆలోచించిన ప్రేక్షకుల కంటే ‘సుకుమార్ దగ్గర ఎందుకు చేస్తున్నాడు?’ అని ఆలోచించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎందుకంటే… ‘బాహుబలి’తో దర్శకుడిగా రాజమౌళి స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అందులోనూ సింహాకి బాబాయ్ వరుస. కీరవాణి ఓ మాట చెబితే… కీరవాణి వరకూ ఎందుకు? రాజమౌళి దగ్గరకు వెళ్లి సింహా నోరు తెరిచి అడిగితే… మేటర్ ఫినిష్. అలా కాకుండా సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరడంలో ఆంతర్యం ప్రేక్షకులకు అంతు బట్టలేదు. కొడుకును సుకుమార్ దగ్గరకు కీరవాణి ఎందుకు పంపించారా? అని ఎంతోమంది ఆలోచించారు. అసలు విషయం ఏంటంటే… ‘కీరవాణి కుమారుడు’ సింహా అనే సంగతి సుకుమార్‌కి ముందు తెలీదట!
సింహా గురించి సుకుమార్ మాట్లాడుతూ “మూడు నెలల పాటు ఓ కుర్రాడు ప్రతిరోజూ వచ్చి రోడ్డు మీద నా కారు దగ్గర నాకోసం వెయిట్ చేసేవాడు. ‘సార్… మీ దగ్గర జాయిన్ అవుతా’ అనేవాడు. అతనెవరో నాకు తెలీదు. ‘ఆ అబ్బాయ్ ఎవరో రోజూ తిరుగుతున్నాడు. ఒకసారి పిలవండి. మాట్లాడదాం’ అని పిలిపించా. ‘నేను మీ దగ్గర అబ్జర్వేషన్‌కి వస్తా’ అన్నాడు. సరేనని చెప్పి పంపించా. అంతా ఒకే అయ్యి, తీసుకున్న తరవాత కీరవాణిగారి అబ్బాయి అని తెలిసింది. నాకు కీరవాణిగారు ఒక్క ఫోన్ చేసి ‘మా అబ్బాయిని నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకో’ అంటే వెంటనే తీసుకుంటా. అలా కాకుండా సింహా తన సొంతదారిలో ప్రయత్నించాడు. వెరీ ఇండిపెండెంట్. కీరవాణిగారు పిల్లల్ని పెంచిన విధానం చూసి ఆశ్చర్యపోయా” అన్నారు. రాజమౌళికి ఇష్టమైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. బహుశా… ఒకప్పుడు సుకుమార్ లెక్కల మాస్టారు కదా. అన్నయ్య కీరవాణి కుమారుడికి పాఠాలు చెప్పినట్టు దర్శకత్వం గురించి బాగా చెబుతారని పంపారేమో. అలాగే, దర్శకులు కావాలనుకునే యువత ఎంత కష్టపడుతున్నారో తెలియడం కోసం అజ్ఞాతవాసి టైపులో అబ్బాయి చేత ట్రయల్స్ చేయించారేమో!