‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కాలి. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు… బన్నీ ఆలోచనలు మారాయని, త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టి, పుష్ప 3 పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సాధించిన విజయం, ఈ ఫ్రాంచైజీకి ఏర్పడిన క్రేజ్ చూస్తే.. ‘పుష్ప 3’ ఇప్పుడు పూర్తి చేసి, రిలీజ్ చేసినా ఇదే ఊపు ఉంటుంది. అందులో మరో అనుమానం లేదు. మైత్రీ కూడా పుష్ప 3 పట్టాలెక్కించడానికి సిద్ధమే. కానీ పుష్ప 3 అనేది హడావుడిగా ఎక్కించే ప్రాజెక్ట్ కాదు. దానికి కొంత సమయం, సాధన అవసరం.
‘పుష్ప 1′ సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొన్న సుకుమార్ పుష్ప 2ని మొదలెట్టడానికి చాలా టైమ్ తీసుకొన్నాడు. కథ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని “పుష్ప 2’ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పుష్ప 1 కంటే 2 పెద్ద హిట్టు. అలాంటప్పుడు పార్ట్ 3 కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొంటాడో కదా? పైగా ‘పుష్ప 2’తో హీరోకి ఉన్న ప్రధాన కాన్ఫ్లిక్ట్ పూర్తయ్యింది. తన ఇంటి పేరు తనకు వచ్చేసింది. పార్ట్ 3 రాయాలంటే ఇంకా బలమైన సంఘర్షణ దొరకాలి.
సుకుమార్ పుష్ప హ్యాంగోవర్ లోంచి బయటకు వచ్చి, మరో సినిమా చేద్దామనుకొంటున్నాడు. రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నాడు. చరణ్ – బుచ్చిబాబు సినిమా పూర్తయ్యేలోగా సుకుమార్ కథ రాసుకొంటాడు. సుకుమార్ దగ్గరున్న ప్రణాళిక ప్రస్తుతానికి ఇంతే. బన్నీకి కూడా కాస్త ఛేంజొవర్ కావాలి. పుష్ప క్యారెక్టర్లోనే దాదాపు నాలుగేళ్లు ఉండిపోయాడు. పుష్ప 3 మొదలెడితే మరో రెండేళ్లు ఖాయం. ఒకే క్యారెక్టర్‌తో ఇన్నేళ్లు ప్రయాణం చేయాలంటే ఎంతటి స్టార్‌కైనా కష్టమే. కాబట్టి.. తనకు కూడా వెనువెంటనే ‘పుష్ప 3’ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా త్రివిక్రమ్ బన్నీ కోసం పెద్ద సెటప్ తయారు చేసుకొంటున్నాడు. అలాంటప్పుడు త్రివిక్రమ్ ని కాదని.. పుష్ప 3ని ముందుకు తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం.
ఒకవేళ త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతుందని బన్నీ భావిస్తే ఈలోగా చక చక పూర్తయ్యే మరో ప్రాజెక్ట్ బన్నీ సెట్స్‌పైకి తీసుకెళ్లొచ్చు. కానీ.. బన్నీతో ఏడెనిమిది నెలల్లో సినిమా పూర్తి చేయగలిగే దర్శకుడు ఎవరు? పుష్ప 2తో బన్నీ ఫాలోయింగ్ మరింత పెరిగింది. దాన్ని బాలెన్స్ చేయగలిగే కథ కావాలి. ఇవన్నీ ఇప్పట్లో కుదరని విషయాలు. కాబట్టి ఎలా చూసినా.. పుష్ప 2 తరవాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడమే సరైన నిర్ణయం.