సక్సెస్ మీట్లూ, థాంక్స్ మీట్లు, అభినందన సభ.. ఇలా పేరు ఏదైనా సదరు సినిమానీ, అందులో నటించిన హీరో హీరోయిన్లను తీసిన దర్శకుడ్ని తెగ పొగిడేయడమే పని. కొన్ని కొన్ని సార్లు ఆ పొగడ్తలు హద్దులు దాటి ‘జోకులు’గా మారిపోతుంటాయి. ఇలాంటి ప్రహసనమే.. ‘శ్రీరస్తు – శుభమస్తు’ సక్సెస్ మీట్లో జరిగింది. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై… యావరేజ్ టాక్ తెచ్చుకొంది. అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాని హిట్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండ్రోజులకు ఓసారి ఏదోలా తమ సినిమా వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం దాసరి, సుకుమార్, వినాయక్ ఇలా దర్శకులందరినీ తీసుకొచి పొగడ్తల కార్యక్రమం షురూ చేశారు. అందులో సుకుమార్ పొగడ్త కాస్త జోక్‌గా మారింది.
ఇంతకీ ఆయనేమంటాడంటే.. ”కామెడీ టైమింగ్‌లో బన్నీ కంటే.. ఈ సినిమాలో శిరీష్ బెటర్‌గా అనిపించాడు. తన వాయిస్, కామెడ టైమింగ్ బన్నీ కంటే బెటర్‌గా ఉన్నాయి. మూడో సినిమాకే ఇంత ఇంప్రూవ్ మెంట్ చేయడం గ్రేట్. ఈ విషయాన్ని నేను బన్నీకి కూడా చెప్పా” అన్నాడు సుక్కు. పనిలో పనిగా పరశురామ్‌ని కూడా పొగిడేశాడు. ”త్రివిక్రమ్ తరవాత ఆ స్థాయిలో సంభాషణలు రాయగలిగిన దర్శకుడు పరశురామ్” అంటూ కితాబిచ్చాడు. ఇది మరీ టూమచ్ అండోయ్ అంటూ అక్కడున్నవాళ్లంతా జోకులు వేసుకోవాల్సివచ్చింది.