‘పుష్ప’కి పార్ట్ 2 గా పుష్ప రూలింగ్ ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. పుష్ప కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ‘తగ్గేదేలె’డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా రీల్స్ లో వైరల్ అయ్యింది. సినిమా తారల నుంచి క్రికెట్ సెలబ్రిటీల వరకూ ప్రముఖులు పుష్ప డైలాగ్ ని రిపీట్ చేశారు. శ్రీవల్లి పాటలో బన్నీ కాలు ఈడ్చుకుంటూ చేసి స్టెప్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇందులో ఏది కూడా పార్ట్ 2 పై ఆసక్తిని పెంచే ప్రమోషనల్ కంటెంట్ కాలేదనే చెప్పాలి.
పార్ట్ 2 పై ఆసక్తిని పెంచడంలో బాహుబలి ఒక మార్క్ ని సెట్ చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అనే ఒక్క ప్రశ్న బాహుబలి పార్ట్ 2 ని నిరంతరం జనాల్లో ఉంచింది. కానీ పుష్పకి ఇలాంటి క్యురియాసిటీని పెంచే పాయింట్ దొరకలేదు. నిజం చెపాలంటే పుష్ప ని ముగించిన విధానం కూడా ఒక ఇంటర్వెల్ లానే వుంటుంది. తర్వాత కథ ”పుష్ప వెర్సస్ బన్వర్ సింగ్ షెకావత్” గా ఉంటుందని సులువుగానే తెలిసిపోతుంది.
అయితే ఇప్పుడు సుకుమార్ పుష్ప పార్ట్ 2పై బాహుబలి లాంటి బలమైన, ఆసక్తికరమైన ఒక ప్రశ్నని జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో భాగమే.. ‘వేర్ ఈజ్ పుష్ప’. సినిమాలోని ఒక సీక్వెన్స్ ని టీజర్ గా వదిలేశారు. ఈ టీజర్ చివర్లో తప్పితే బన్నీ ప్రజన్స్ లేదు. సుకుమార్ ఉద్దేశం ఇందులో బన్నీని చూపించాలని కాదు. పుష్ప ఎక్కడ ? అనే ప్రశ్నని జనాల్లోకి తీసుకెళ్లడమే. సుకుమార్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. సెకండ్ పార్ట్ లో పుష్ప కి ఏమైయింది ? ఎక్కడి వెళ్ళాడు ? అనే క్యురియాసిటీని అయితే కలిగించగలిగాడు సుకుమార్.