సుకుమార్ మంచి దర్శకుడే కాదు. అభిరుచి ఉన్న నిర్మాత కూడా. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తాడు. ప్రోత్సహిస్తాడు. ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. ఇప్పుడు ఆయన దృష్టి… వి.యశస్వీ అనే కుర్రాడిపై పడింది. యశస్వీ దర్శకుడిగా సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేయాలని సుక్కు నిర్ణయించుకొన్నారు. సాధారణంగా తన దగ్గర పని చేసిన సహాయకులకు సుక్కు ఛాన్స్ ఇస్తుంటాడు. కానీ.. యశస్వీకీ, సుక్కూకీ ఎలాంటి గత పరిచయాలూ లేవు.
‘సిద్దార్థ్ రాయ్’ అనే ఓ సినిమా తీశాడు యశస్వీ. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ టీజర్లో మాత్రం ఇంపాక్ట్ కనిపించింది. ఓ కొత్త కాన్సెప్ట్ తో, క్యారెక్టరైజేషన్‌తో ఈ సినిమా రాబోతోందన్న హింట్ ఆ టీజర్ ఇచ్చేసింది. పాటలూ జనంలోకి వెళ్లాయి. ఆ టీజర్ నచ్చే… యశస్వీని పిలిపించాడు సుకుమార్. ఆ తరవాత ‘సిద్దార్థ్ రాయ్’ ఫుటేజీ చూడడం, అది సుకుమార్ కి విపరీతంగా నచ్చడంతో… యశస్వీకి తన బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. తన తొలి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమా సుకుమార్ రైటింగ్స్‌లో అందుకొన్నాడంటే.. మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.