ఉండొచ్చు. ఓ హీరోపై ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎంతైనా ఉండొచ్చు. ప్రేమించొచ్చు.. ఆకాశానికి ఎత్తేయొచ్చు. మళ్లీ మళ్లీ ఆ హీరోతోనే సినిమా తీయొచ్చు. ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఉండవు. ఉండకూడదు. కానీ… ఓ హీరోతో మరొకర్ని, అందులోనూ లెజెండరీ పర్సనాలిటీని పోల్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది చేయలేకపోయాడు సుకుమార్.
అల్లు అర్జున్ – సుకుమార్‌ల మైత్రీ బంధం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఒకరు శరీరం అయితే ఇంకొకరు ఆత్మ. ఒకరు లేకుండా మరొకరి కెరీర్ లేదు. పుష్పతో బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇదంతా సుకుమార్ వల్లే. సుకుమార్‌కు కూడా బన్నీ ఓ వజ్రంలా దొరికాడు. అందుకే ఇద్దరూ వీలైనప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ధారాళంగా ప్రకటించుకొంటారు. అందులో తప్పేం లేదు కూడా.
‘పుష్ప 2 ధ్యాంక్స్ మీట్లో’నూ ఇలా ఒకర్ని ఇంకొకరు పొగుడుకుంటూ మాట్లాడుకొన్నారు. ఇందులోనూ తప్పు లేదు. అది వాళ్లపై వాళ్లకున్న ప్రేమ. అయితే… ఓ సందర్భంలో సుకుమార్ బన్నీని ‘ఎస్వీఆర్’తో పొల్చాడు. ఇది ఆయన మాట కాకపోయినా పోలిక మాత్రం అసందర్భం. అనాలోచితం. ‘ఎస్వీఆర్ బన్నీలా డాన్సులు, ఫైటింగులు చేయగలడా’ అనేది ఎగస్ట్రా జోడింపు. అది మరింత ఆక్షేపణియం.
ఎస్వీఆర్ – అల్లు అర్జున్.. మధ్యలో మూడు తరాలు మారాయి. ఎస్వీఆర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మణి మాణిక్యం. వజ్ర సమానం. ఆయన్ని ఆ రంగంలో కొట్టేవాడే లేడు. తెలుగు తెరకు.. అంతెందుకు భారతీయ చలన చిత్ర రంగంలోనే ఎస్వీఆర్‌ని కొట్టే ఆర్టిస్టు ఇప్పటి వరకూ పుట్టడు.. పుట్టబోడు. అలాంటి ఎస్వీఆర్ తో బన్నీని పోల్చడం (బహుశా ఇది సుకుమార్‌ని కలిసిన బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం కావొచ్చు కాగ) ఏమాత్రం బాగాలేదు. ఒకవేళ ఆ అభిమానులు సుకుమార్ దగ్గర ఈ విషయాన్ని సరిగ్గా సుకుమార్ చెప్పినట్టే ప్రస్తావించి, తమ అభిమానాన్ని చాటుకొని ఉండొచ్చు. కానీ.. దాన్ని సుకుమార్ మనసులోనే దాచుకోవాల్సింది. ఎందుకంటే సుకుమార్ లాజిక్కుల్లో దిట్ట. `ఎస్వీఆర్… బన్నీ.. పోలిక లేదు కదా` అని మనసులోనే అనుకొని, దాన్ని అక్కడే నిక్షిప్తం చేయాల్సింది. దాన్ని అందరి ముందూ బయట పెట్టాడు. అప్పటికప్పుడు ఈ పోలిక వేదిక ముందున్నవాళ్లనీ, ముఖ్యంగా అల్లు అర్జున్‌నీ, ఆయన అభిమానుల్ని సంతోషపరిచి ఉండొచ్చు,. కానీ కాసేపయ్యాక ఆలోచిస్తే.. ‘ఈ పోలిక ఎంత దారుణం’ అని స్వయంగా సుకుమార్‌కే అనిపిస్తుంది. ఎందుకంటే.. అది అక్షరాలా నిజం కాబట్టి.
అల్లు అర్జున్ స్టార్. మంచి యాక్టర్. జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి, నటుడిగా ఇంకాస్త గౌరవాన్ని సంపాదించుకొన్నాడు. బన్నీని అలానే ఉంచండి. పోలికలు తెచ్చి, యాంటీ ఫ్యాన్స్‌కి ఉప్పూ, ఉప్మాలూ అందించాల్సిన అవసరం లేదు. ఈతరం కుర్రాళ్లకు ఎస్వీఆర్ వైభవం, ఆయన నటనా చాతుర్యం అంతగా తెలిసి ఉండకపోవొచ్చు. ఆయన్ని చూసిన వాళ్లు, ఇప్పటికీ పాత సినిమాలు ఆయన కోసమే వెదికి మరీ చూసి మురిసిపోయేవాళ్లు మాత్రం సుకుమార్ మాటలు చూసి లోలోపల నవ్వుకొంటుంటారు. ఇది అవసరమా ఇప్పుడు..?!