సుకుమార్ తో సినిమా అంటే టైమ్ టేకింగ్ ప్రోసెస్. క్వాలిటీపై ఆయన పెట్టే శ్రద్ధ అలా ఉంటుంది. అవుట్ పుట్ బ్రహ్మాండంగా రావాలంటే, అంచనాలు అందుకోవాలంటే ఆ మాత్రం చెక్కుడు తప్పనిసరి. అందుకే హీరోలూ, నిర్మాతలూ అందుకు రెడీ అయిపోతుంటారు. ‘పుష్ష 2’ ఈ ఆగస్టు 15కి రావాలి. కానీ… షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు సుకుమార్ దగ్గర కావాల్సినంత టైమ్ ఉంది. అందుకే మరింతగా క్వాలిటీ కోసం పరితపిస్తున్నాడు.
‘పుష్ష 2’ కోసం సుకుమార్ ఇంకాస్త వెరైటీగా ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా కీలకం. అందుకోసం భారీ యాక్షన్ సీన్ డిజైన్ చేశారు. ఈ సీన్‌లో దాదాపు ‘పుష్ష 2’ నటీనటులంతా ఉండాలి. షెడ్యూల్ కూడా పెద్దదే. కనీసం 15 రోజుల పాటు ఈ క్లైమాక్స్ తెరకెక్కించాల్సి ఉంటుంది. అంతా ప్లాన్ ప్రకారం సరిగ్గా సెట్ చేయాలని సుకుమార్ చూస్తున్నాడు. అందుకోసం ఓ సెటప్ రెడీ చేశాడు. ముందుగా డమ్మీ ఆర్టిస్టులతో క్లైమాక్స్ ని రఫ్‌గా షూట్ చేసి, ఆ తరవాత నిజం షూటింగ్ మొదలెడతారని టాక్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో డమ్మీ క్లైమాక్స్ షూట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా పాటలకు స్టెప్పులు రిహార్సల్స్ చేస్తుంటారు. సుక్కు మాత్రం క్లైమాక్స్ లో షాట్లూ, ఫైట్ సీక్వెన్స్‌లను సైతం రిహార్సల్స్ చేయిస్తున్నాడట. సుక్కు డెడికేషన్ అలా ఉంటుంది మరి.