క్రిష్ లానే సుకుమార్ కూడా పుస్తకాల పురుగు. ఎప్పుడూ ఏదో ఓ పుస్తకం చదువుతూనే ఉంటాడు. సాహిత్యం అంటే అంతిష్టం. కథలు, కవితలు కూడా రాస్తుంటాడు. `కొండపొలం` పుస్తకం గురించి తెలుసుకుని, ఆ పుస్తకాన్ని చదివాడు సుకుమార్. చదివిన వెంటనే `సినిమా తీస్తే ఎలా ఉంటుంది` అనిపించింది. రైట్స్ గురించి ఆరా తీశాడు. పుష్ష తరవాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా ఈ సినిమా తీయాలని భావించాడు. కానీ `పుష్ష` ఎప్పుడైతే 2 భాగాలుగా తీయాల్సివచ్చిందో, అప్పుడు ఆ ప్రయత్నం మానుకోవాల్సివచ్చింది. తన శిష్యుడికెవరికైనా ఈ నవల ఇచ్చి, సినిమాగా తీయమంటే ఎలా ఉంటుందా? అని కూడా అనుకున్నాడట. ఆ ఆలోచననీ పక్కన పెట్టాడు. క్రిష్‌కి `కొండపొలం` నవలని ముందుగా పరిచయం చేసింది సుకుమారే. అలా.. క్రిష్ `కొండపొలం` సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఓ కారణం అయ్యాడు. నిజంగానే..సుకుమార్ ఈ నవలని సినిమా తీస్తే ఎలా ఉండేదో..? క్రిష్ స్టైల్ వేరు. సుకుమార్ పద్ధతి వేరు. కచ్చితంగా మరో కోణంలో `కొండపొలం` చూసేవాళ్లం. సుకుమార్‌కి కూడా నవలల్ని సినిమాలుగా తీయాలన్నది ఆలోచన. ఎప్పటికైనా ఆ ప్రయత్నం నెరవేరుతుందేమో చూడాలి.