‘పుష్ప 2’తో ఓ సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొన్నాడు సుకుమార్. ఆ తరవాత రామ్ చరణ్ తో సినిమా పట్టాలెక్కించాలి. మధ్యలో ‘పెద్ది’ ఉంది కాబట్టి, సుకుమార్‌కు కావల్సినంత సమయం దొరికింది. ఈలోగా తన శిష్యుల లైఫ్ సెటిల్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. సుకుమార్ దగ్గర శిష్యులుగా పని చేసిన దాదాపు అరడజను దర్శకులకు ‘సుకుమార్ రైటింగ్స్’ ద్వారా ఛాన్స్ ఇవ్వడానికి సుక్కు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం వీళ్ల కథలు విని, మార్పులు చేర్పులూ చేసి, హీరోల్ని సెట్ చేసి పట్టాలెక్కించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు సుకుమార్.
ఈమధ్య కాలంలో సుకుమార్ దాదాపు 100 కథలు విన్నాడని తెలుస్తోంది. అవన్నీ తన శిష్యుల కథలే. ప్రతీ రోజూ కొన్ని కథలు వినడం, వాటిని ఫైన్ ట్యూన్ చేయడం.. సుకుమార్ డైలీ రొటీన్‌గా మారింది. వీటిలో కనీసం ఆరు కథలు ఓకే చేసి, ఆరుగురు కొత్త దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేయాలనుకొంటున్నాడట సుకుమార్. ఓ ఓటీటీ సంస్థతోనూ సుకుమార్ టైఅప్ అవుతున్నాడని, పెట్టుబడి అంతా ఓటీటీ సంస్థ చూసుకొంటుందని, క్రియేటీవ్ హెడ్ గా సుకుమార్ పని చేస్తారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
సుకుమార్ శిష్యులుగా వచ్చినవాళ్లు చాలామంది ఇప్పుడు సెటిలైపోయారు. బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కథలోనూ సుకుమార్ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు లాంటి మరింత మంది దర్శకులు సుకుమార్ రైటింగ్స్ తయారవుతున్నారు. శిష్యుల కెరీర్ గురించి ఇంతగా ఆలోచించే ఓ దర్శకుడు దొరకడం… నిజంగా అదృష్టమే.