తన శిష్యుల్ని సుకుమార్ పట్టించుకున్నంతగా మరో దర్శకుడు పట్టించుకోడేమో..? తన దగ్గర పనిచేసినవాళ్లందరినీ ఏదో ఓ రూపంలో సెట్ చేసేస్తున్నాడు సుకుమార్. అందుకు తాజా ఉదాహరణ.. బుచ్చిబాబు. `ఉప్పెన`తో బుచ్చి ఓ బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు. ఈ సినిమా వెనుక కర్త, కర్మ, క్రియ.. అన్నీ సుకుమారే. తనే లేకపోతే… ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నమ్మి.. బుచ్చి చేతుల్లో పెట్టేవారు కాదు.
తొలి సినిమా హిట్టయ్యింది. ఇక బుచ్చికి తనదంటూ ఓ మార్గం ఏర్పడింది. అయినా.. ఇప్పుడు కూడా శిష్యుడి చేయి వదల్లేదు సుకుమార్. ఎందుకంటే బుచ్చిబాబులో ఇప్పుడే ఇంకాస్త కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే.. తన రెండో సినిమా ఎన్టీఆర్ తో అనుకున్నాడు. కానీ అది ఇప్పట్లో కుదరేలా లేదు. అందుకే.. అల్లు అర్జున్ చెంతకు చేరాడు. బన్నీకీ – బుచ్చిబాబుకీ మీటింగ్ సెట్ చేసిందే… సుకుమారే. బన్నీ ఇప్పుడు డైలామాలో ఉన్నాడు. `పుష్ఫ` తరవాత ఎలాంటి సినిమా చేయాలా? అనే సందిగ్థంలో ఉన్నాడు. అటు బన్నీని కూడా… సుకుమారే గైడ్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. బన్నీకి కాస్త నచ్చజెప్పి.. శిష్యుడి తో సినిమాని పట్టాలెక్కించాలన్నది సుకుమార్ ప్రయత్నం. ఒకవేళ బన్నీకి వీలుకాకపోయినా.. మరో హీరోతో.. ఆ కథని సెట్ చేయడానికి సైతం సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభించాడట. ఎప్పుడైతే… సుకుమార్ ఎంటరై.. బుచ్చికి భరోసా ఇచ్చాడో, బుచ్చి కాస్త రిలాక్స్ అయ్యాడట. ఇక బుచ్చి భారమంతా.. సుకుమార్‌దే.